- మరికొద్ది గంటల్లో తేలనున్న పెద్దపల్లి, కరీంనగర్ అభ్యర్థుల భవితవ్యం
- ఎస్ఆర్ఆర్ కాలేజీలో కరీంనగర్, రామగిరి జేఎన్టీయూలో పెద్దపల్లి స్థానాల కౌంటింగ్
- ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రారంభం
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కరీంనగర్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్(బీజేపీ), వెలిచాల రాజేందర్ రావు(కాంగ్రెస్), వినోద్ కుమార్(బీఆర్ఎస్) తోసహా 28 మంది పోటీ పడగా, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ(కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్(బీజేపీ), కొప్పుల ఈశ్వర్(బీఆర్ఎస్) సహా 42 మంది బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మే 13న నిర్వహించిన ఎంపీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు మరికొద్ది గంటల్లో మొదలుకానుంది. సాయంత్రంకల్లా రిజల్ట్స్ రానుండడంతో ఎవరిని విజయం వరిస్తుందోనన్న ఆందోళనలో అభ్యర్థులున్నారు. పోలైన ఓట్లు, తమ గెలుపు విషయంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎవరి లెక్కలు వారికి ఉన్నా.. ఏదో ఒక మూలాన ప్రతిఒక్కరిలో ఆందోళన కనిపిస్తోంది.
పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌తో ప్రారంభం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్లను లెక్కించేందుకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో కలెక్టర్ పమేలా సత్పతి సారథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 17,97,150 మంది ఓటర్లు ఉండగా, 13,03,690 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 72.54 నమోదైంది. వయోవృద్ధులు, దివ్యాంగులు 1625 మంది ఉండగా, హోమ్ ఓటింగ్ ద్వారా 1560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సిబ్బంది 10,200 మంది ఉండగా 8,811 మంది, సర్వీస్ ఓటర్స్ 1,018 మంది ఉండగా, 476 మంది ఓటేశారు.
పోలైన ఓట్లను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా కౌంట్ చేయనున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 395 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 18 టేబుళ్లపై 22 రౌండ్లు, చొప్పదండి లోని 327 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుళ్లపై 24 రౌండ్లు, వేములవాడలోని 260 స్టేషన్లకు సంబంధించి 14 టేబుళ్లపై 19 రౌండ్లు, సిరిసిల్ల 14 టేబుళ్ల(287 పోలింగ్ స్టేషన్లకు)పై 21 రౌండ్లు, మానకొండూర్ 14 టేబుళ్ల(316 పోలింగ్ స్టేషన్లకు)పై 23 రౌండ్స్, హుజూరాబాద్ 14 టేబుళ్ల(305 పోలింగ్ స్టేషన్లు)పై 22 రౌండ్లు, హుస్నాబాద్ 14 టేబుళ్ల(304 పోలింగ్ స్టేషన్లు)పై 22 రౌండ్లలో లెక్కింపు నిర్వహించనున్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. 8.30 గంటల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ప్రకటించనున్నారు. కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతి ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.
రామగిరి జేఎన్ టీయూలో పెద్దపల్లి కౌంటింగ్..
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం జేఎన్ టీయూ ఇంజినీరింగ్ కాలేజీ లో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 15,96,430 మంది ఓటర్లు ఉండగా, 1850 పోలింగ్ స్టేషన్లలో 10 ,83,453 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 67.87 నమోదైంది. పోలైన ఓట్లను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా కౌంట్ చేయనున్నారు. చెన్నూర్ నియోజకవర్గ ఓట్లను 14 టేబుళ్లపై 16 రౌండ్స్, బెల్లంపల్లి ఓట్లను 14 టేబుళ్లపై 16 రౌండ్లు, మంచిర్యాల –14 టేబుళ్లపై 21 రౌండ్లు, ధర్మపురి–14 టేబుళ్లపై 19 రౌండ్లు, రామగుండం –14 టేబుళ్లపై 19 రౌండ్లు, మంథని–14 టేబుళ్లపై 21 రౌండ్లు, పెద్దపల్లి నియోజకవర్గం ఓట్లు 14 టేబుళ్లపై 21 రౌండ్లలో లెక్కించనున్నారు.
పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించాలి
పెద్దపల్లి, వెలుగు: పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించాలని పెద్దపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ముజమ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్మాట్లాడారు. కౌంటింగ్ సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డులను తమ వెంట తీసుకుని రావాలని, కౌంటింగ్ హాల్‌లోకి సెల్ ఫోన్ అనుమతి లేదన్నారు. ప్రతి కంట్రోల్ యూనిట్‌లో మొత్తం ఓట్ల వివరాలు ఫారం 17 సీ పార్ట్ 1తో సరిచూసుకోవాలన్నారు.