కరీంనగర్, వెలుగు: ఆటో డ్రైవర్ల సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తానని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం కరీంనగర్ లోని సెయింట్ జాన్స్ స్కూల్ వద్ద బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను కలిసి వారితో కలిసి ఛాయ్ తాగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనాన్స్‌లో తెచ్చి ఆటోలు నడుపుతున్నామని, అప్పులకు వడ్డీలు కూడా కట్టేలేకపోతున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. సంజయ్ స్పందిస్తూ.. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదేనని, అదే సమయంలో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.