రేవంత్ సర్కారుపై ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు..

దివ్యాంగులు, మహిళలు, వృద్దులు, పిల్లల కోసం గత మూడేళ్లలో కేంద్రం రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఉపకరణాలు రానివాళ్లు బాధపడాల్సిన పనిలేదని, మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వారందరికీ త్వరలోనే ఉప కరణాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ‘సామాజిక అధికార శిబిరం’  పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్... దివ్యాంగులకు ట్రై సైకిల్స్, చేతి కర్రలు, వినికిడి యంత్రాలు సహా 18 రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ  అధికారులు హాజరయ్యారు.  

బీఆర్ఎస్ పాలనలో నిర్బంధాల మధ్య అధికారులు పనిచేశారని, ఇప్పుడు అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని చెప్పారు ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వమైనా అధికారులకు స్వేచ్ఛ ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి నిధులన్నీ మోదీ సర్కార్  ఇచ్చినవే అని తెలిపారు. ఏడీఐపీ (Assistance to Disabled Persons), ఆర్వీవై ( రాష్ట్రీయ వయోశ్రీ యోజన) పథకం కింద బుధవారం (డిసెంబర్ 27న) 731 మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు.