కరీంనగర్ ​బాలుడిని..దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో పెరుగుతున్న బాలుడి(6)ని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్నారు. ఇటలీకి చెందిన అలెస్సియో, రఫెల్లా దంపతులకు పిల్లలు లేరు. అడాప్ట్​కోసం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(సీఏఆర్ఏ)ని సంప్రదించారు. కరీంనగర్​మాతా శిశు కేంద్రంలో పెరుగుతున్న బాలుడిని ఆన్ లైన్​లోనే ఎంపిక చేసుకున్నారు. సోమవారం కరీంనగర్​కలెక్టర్​పమేలా సత్పతి సమక్షంలో అలెస్సియో, రఫెల్లా దంపతులు బాలుడిని దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇటలీలో బాలుడికి అందించే విద్య, వైద్య ఇతర సౌకర్యాలను వివరించారు. అంతకు ముందు ఇటలీ దంపతుల వివరాలు, ఆర్థిక పరిస్థితి గురించి కలెక్టర్​ఆరా తీశారు. అంతా ఓకే అనుకుని నిర్ధారించుకున్నాకే దత్తత ఇచ్చారు.

ఇటలీ దంపతులకు కౌన్సిలింగ్​ఇచ్చి, సీఏఆర్ఏ నిబంధనల ప్రకారమే బాలుడిని అప్పగించామని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం.సరస్వతి తెలిపారు. కాగా పెంచే స్థోమత లేక బాలుడికి రెండేళ్లు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు కరీంనగర్​మాతాశిశు కేంద్రంలో వదిలేశారు. అప్పటి నుంచి ఇక్కడే పెరుగుతున్నాడు. 2021, డిసెంబర్ 5న శిశు కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సదరు బాలుడు గాయపడ్డాడు. ఆ ఘటన ఎలా జరిగిందనే విషయం నేటికీ తేలలేదు.