కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివనిపల్లెలో జరిగిన గ్రామసభలో గందరగోళం చోటు చేసుకుంది. గతంలో వివిధ ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రకటించారు. సంక్షేమ పథకాల లిస్టులో అర్హత ఉన్నా తమ పేరు తమ పేర్లు రాలేదంటూ గ్రామసభలో స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారులు ప్రకటించిన జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూమిలేని నిరుపేదలను పక్కనపెట్టి భూమి ఉన్న ఆసాములకు, ప్రభుత్వ ఉద్యోగులను లబ్దిదారుల జాబితాలో పేర్లు చేర్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కరోజు కూడా ఉపాధిహామీ పనికి రానివారి పేర్లు ఆత్మీయ భరోసాలోఉన్నాయని అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో తన పేరు లబ్దిదారుల జాబితాలో లేదరి ఓ మహిళ అధికారుల ఎదుట కంటతడి పెట్టింది. ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి డబ్బులు రాలేదంటూ వృద్ద దంపతులు రోదించారు. లబ్ధిదారుల జాబితా బహిరంగంగా చదవడంతో జాబితాలో అనర్హులు ఉన్నారంటూ అడ్డు చెప్పడంతో పేర్లు వచ్చిన వారికి, రాని వారికి మధ్య గొడవ జరిగింది.