కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఫోకస్ పెంచారు. కరీంనగర్ ఆర్టీఏ ఆఫీసులో ఉన్న చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ కు తన రాజకీయ గురువు, దివంగత మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు పేరు పెట్టారు. 2019 లో ఏర్పాటు చేసిన ఈ చిల్డ్రన్స్ పార్క్ కు కృష్ణమనేని వెంకట రామారావు ట్రాఫిక్ అవేర్ నెస్ పార్క్ గా పేరు పెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
అప్పుడు రాష్ట్ర రవాణా శాఖలో అన్నీ తానై వ్యవహరించిన డీటీసీ పాపారావు తండ్రే వెంకట రామారావు. కరీంనగర్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన జువ్వాడి చొక్కా రావు పేరును ట్రాఫిక్ అవేర్ నెస్ పార్కుకు పెట్టడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఎంవీఐల ట్రాన్స్ ఫర్..
రవాణా శాఖలో ఓడీలు, అదనపు బాధ్యతలు, ఇన్ చార్జి బాధ్యతలను రద్దు చేసిన నేపథ్యంలో కరీంనగర్ రవాణా శాఖలో ట్రాన్స్ ఫర్లు జరిగాయి. జిల్లాలో ఓడీపై పని చేస్తున్న గౌస్ పాషా ఖమ్మం జిల్లాకు, మసూద్ అలీ, సిరాజుర్ రహ్మాన్ పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఖమ్మంలో బాధ్యతలు నిర్వర్తిసున్న శ్రీనివాస్ , హుస్నాబాద్ లో బాధ్యతలు నిర్వర్తిసున్న ఠాకూర్ ఈశ్వర్ సింగ్ కరీంనగర్ కు ట్రాన్స్ ఫర్ పై వచ్చారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.