నేడు కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్..హాజరుకానున్న మంత్రి కేటీఆర్​

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీకి మరో మణిహారం కేబుల్ బ్రిడ్జి బుధవారం ప్రారంభం కాబోతోంది. మంత్రి కేటీఆర్ ​హాజరై రాత్రి 7 గంటలకు ఓపెనింగ్ ​చేయనున్నారు. అనంతరం సమీపంలోనే మానేరు రివర్ ఫ్రంట్ కోసం ఏర్పాటు చేసిన బండ్​పై కల్చరర్ ఫెస్ట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా కశ్మీర్ గడ్డలో నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, జిల్లా లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా బుధ, గురువారాల్లో రాత్రిళ్లు కల్చరల్ ఫెస్ట్ నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. 

మొదటి రోజు డ్యాన్సర్ నాగదుర్గ, సింగర్స్ మధుప్రియ, మంగ్లీ ఆట, పాటలు, గులాంవర్షి కవ్వాళి, బోస్కో, దుబాయి ఎల్ఈడీ డ్యాన్సర్స్ డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. 80 మంది డ్యాన్సర్లు ఒకేసారి చేసే నృత్యంతో షో పూర్తి కానుంది. గురువారం అరబిక్ వాయిలిన్ సింఫనీ, దుబాయి ఎల్ఈడీ డ్యాన్స్​షో, లేజర్ షో, నాగదుర్గ, ఆట సందీప్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే వర్సీ బ్రదర్స్ కవ్వాళీ ఉంటుంది. బ్రిడ్జి ఓపెనింగ్​సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 

కలర్ ఫుల్ జంక్షన్స్.. 

కరీంనగర్ సిటీలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా హౌసింగ్ బోర్డు ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్ వద్ద ఫౌంటెన్ తో కూడిన తెర చాప పడవ,  రామగుండం బైపాస్ రోడ్డులో  కేబుల్ బ్రిడ్జి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఆకృతులు, కేబుల్ బ్రిడ్జి నుంచి సదాశివపల్లి వెళ్లే రోడ్డులోని జంక్షన్ లో బటర్ ఫ్లైస్  సిటీ జనాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని మంగళవారం రాత్రి మేయర్ సునీల్ రావుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. హైలాండ్ జంక్షన్ ప్రారంభోత్సవంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి, కమిషనర్ సేవా ఇస్లావత్  పాల్గొన్నారు. 

కేబుల్ బ్రిడ్జి విశేషాలివే.. 

ఈ కేబుల్ బ్రిడ్జి టూరిస్ట్ అట్రాక్షన్ నిలవడమేగాక వరంగల్ – కరీంనగర్ సిటీల మధ్య సుమారు 7 కిలోమీటర్ల దూరం తగ్గించనుంది. 2018లో రూ.224 కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభించగా ఐదేళ్లలో నిర్మాణం పూర్తయింది. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ఇదే కావడం విశేషం. రూ.8 కోట్లతో ఏర్పాటు చేస్తున్న  డైనమిక్ లైటింగ్ సిస్టమ్, నాలుగు ఎల్ఈడీ స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పూర్తిగా విదేశీ సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి సామర్థ్యాన్ని ఇప్పటికే పలుమార్లు ఆర్ అండ్ బీ అధికారులు చెక్ చేశారు. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ బ్రిడ్జి మీదుగా వెహికిల్స్ రాకపోకలను బంద్ చేసి పర్యాటకులను మాత్రమే అనుమతించనున్నారు.