కరీంనగర్ సిటీకి తాగునీటి గండం

  •    ఎల్ఎండీలో 7 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వలు
  •     రోజు తప్పించి రోజు సప్లై చేస్తున్న బల్దియా అధికారులు
  •     డ్యాంలో వాటర్ ప్యూరిఫికేషన్‌‌‌‌కూ ఆటంకాలు 

కరీంనగర్, వెలుగు : వేసవిలో కరీంనగర్ సిటీకి తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఎల్ఎండీలో 7 టీఎంసీలకు నీటి నిల్వలు పడిపోవడంతో రోజు తప్పించి రోజు సప్లై చేస్తున్నారు. వ్యవసాయానికి నీళ్లు విడుదల చేయడం, కొంత ఆవిరి అవుతుండడంతో ఎల్ఎండీలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. దీంతో వాటర్ ప్యూరిఫికేషన్ కు కూడా నీటి సరఫరా తగ్గిందని, దీంతో మంచినీటి సరఫరాను డే బై డే చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.  పంటల కోసం కిందికి రోజూ 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో.. రానున్న రోజుల్లో తాగునీటికి మరింత కష్టాలు తప్పవేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సప్లైలో టైం మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ పాటించట్లే..

కరీంనగర్ సిటీలో మొత్తం 60 డివిజన్లు ఉండగా నగరవ్యాప్తంగా 59,531 నల్లా కనెక్షన్లు, 195 పబ్లిక్ కుళాయిలు ఉన్నాయి. గతంలో కరీంనగర్ సిటీలో తాగునీటి సరఫరాలో సమయ పాలన పాటించేవారు. కానీ నెల రోజులుగా నల్లా నీళ్ల విడుదలలో టైం పాటించడం లేదు. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చే నల్లా నీరు ఒక్కోసారి 3.30 గంటలకు, 3 గంటలకు ఇస్తున్నారు. అది కూడా అరగంటలోపే బంద్ అయిపోతున్నాయని  జనం ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక సప్లైలో ప్రెషర్‌‌‌‌‌‌‌‌ ఉండకపోవడంతో హైలెవల్‌‌‌‌ ప్రాంతాలను నీరు రావడం లేదని చెబుతున్నారు.  

సిటీలో హైలెవల్ జోన్ పరిధిలో ఉన్న  విద్యానగర్, సంతోష్ నగర్, భాగ్యనగర్, వావిలాలపల్లి, చైతన్యపురి, బ్యాంకు కాలనీ, జ్యోతినగర్, సుభాష్ నగర్, మార్కండేయ నగర్ కాలనీ, బుట్టిరాజారాంకాలనీ, రాంనగర్, మంకమ్మతోట, సప్తగిరికాలనీ తదితర ప్రాంతాల ప్రజలు ఇప్పటికే తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. విలీన గ్రామాలైన రేకుర్తి, సీతారాంపూర్‌‌‌‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌‌‌‌, అల్గునూర్‌‌‌‌, సదాశివపల్లిలో తాగునీటి సరఫరా అధ్వానంగా మారింది. ఎండాకాలం ముదిరితే ఈ ఏరియాలకు ట్యాంకర్లను  పంపాల్సిన పరిస్థితి  ఏర్పడింది. 

వాటర్ ప్యూరిఫికేషన్‌‌‌‌పై ఎఫెక్ట్​

లోయర్ మానేరు డ్యామ్ నుంచి కాకతీయ కెనాల్‌‌‌‌కు రోజూ 3 వేల క్యూసెక్కుల వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం ఎల్ఎండీ నీటి నిల్వలు  తగ్గడంతో వాటర్ ప్యూరిఫికేషన్‌‌‌‌పై ఎఫెక్ట్ పడింది. గతంలో  డెయిలీ 70 ఎంఎల్ డీలు వాటర్ ఫిల్టర్ బెడ్ కు పంపేవారు. శుద్ధి చేయగా 66 ఎంఎల్‌‌‌‌డీల నీటిని విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం 60 ఎంఎల్‌‌‌‌డీలే విడుదల చేయడంతో రోజూ 51 నుంచి 53 ఎంఎల్‌‌‌‌డీల నీరు మాత్రమే సిటీకి సప్లై అవుతోంది. దీంతో హైలెవల్ జోన్ కు నీటి సరఫరా తగ్గింది. 

మైదానంలా మారిన ఎల్ఎండీ 

ఎల్ఎండీలో నీటి నిల్వలు తగ్గడంతో మైదానాన్ని తలపిస్తోంది. మొన్నటి వరకు నిండు కుండలా ఉన్న రిజర్వాయర్  రెండు నెలల్లో బోసిపోయి కనిపిస్తోంది. ఒకవైపు సాగుకు నీటిని విడుదల చేస్తుండడం, పైన మిడ్ మానేరు నుంచి నీరు రాకపోవడంతో నీరు అడుగంటింది. ఈ నెల 16 వరకు7 టీఎంసీల నీరు డ్యాంలో నిల్వ ఉండగా, ఈ నెల 22నాటికి 6.838 టీఎంసీలకు చేరుకునే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.. 

ఇప్పటివరకు కాస్త ఆలస్యమైనా రోజూ తాగునీరు సరఫరా చేస్తున్నాం. విలీన గ్రామాలు, నీరందని హైలెవల్ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నాం. ఏప్రిల్ లో మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్ కు మూడు టీఎంసీల నీటిని విడుదల చేస్తామని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అంతేగాక అవసరమైన ప్రాంతాల్లో బోర్లను రిపేర్లు చేయించాలని సిబ్బందిని ఆదేశించాం. ప్రస్తుతం రోజూ సగటున 51 ఎంఎల్డీ వాటర్ సప్లై చేస్తున్నాం. 

- శ్రీనివాస్, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ బల్దియా కమిషనర్