కరీంనగర్ కలెక్టర్ ఇంట్లో చోరీ.. ల్యాప్​టాప్, సర్టిఫికెట్లు ఎత్తుకెళ్లిన దొంగ

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ కలెక్టర్ గోపి ఇంట్లో చోరీ జరిగింది. ఆయనకు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పోయిన నెల 30వ తేదీ తెల్లవారుజామున జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో భాగంగా కరీంనగర్ కలెక్టర్​గా పని చేస్తున్న గోపి బదిలీ అయ్యారు. అక్టోబర్ 30న హైదరాబాద్​లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. 

ముందు రోజు రాత్రి తనకు సంబంధించిన ల్యాప్​టాప్, డిజిటల్ కీ, పెన్ డ్రైవ్, పాస్​ఫొటోలు, బ్యాగుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు సర్దుకుని హాల్​లో పెట్టారు. తర్వాత ఆయన బెడ్ రూమ్​లోకి వెళ్లి పడుకున్నారు. అదే రోజు తెల్లవారుజామున క్యాంప్ ఆఫీస్ వెనుక వైపు నుంచి గోడ దూకి లోపలికి వచ్చిన దుండగుడు.. హాల్​లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్లాడు. 

కలెక్టర్ క్యాంప్ సూపరింటెండెంట్ రామ్మోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్యాంప్ ఆఫీస్​లోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. ఓ వ్యక్తి గోడ దూకి ఇంట్లోకి వచ్చి.. డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎత్తుకెళ్లినట్లు రికార్డైంది. నిందితుడికి సంబంధించిన ఫొటో రిలీజ్ చేశామని, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వన్​టౌన్ ఇన్​స్పెక్టర్ రవి తెలిపారు.