కరీంనగర్ టౌన్, వెలుగు: వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరి రోజు ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి జ్యోతిబాపూలే మైదానం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతివేగంతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడొద్దని సూచించారు. అనంతరం సప్తగిరి కాలనీలోని గవర్నమెంట్ హైస్కూల్‌లో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అంతకుముందు కరీంనగర్ శిశు గృహలో పెరుగుతున్న నాలుగు నెలల శిశువును కలెక్టర్ పూణెకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు.
పకడ్బందీగా ఎలక్షన్ కోడ్ అమలుచేయాలి
ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్‌లో ఎన్నికల కోడ్ అమలుపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కోడ్పూర్తయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మీకిరణ్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీటీసీ పురుషోత్తం, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్, వెలుగు: జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల ముగిశాయి. శుక్రవారం జగిత్యాల పాత బస్టాండ్‌లో ఎంవీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు.
గోదావరిఖని, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని రామగుండం మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ రెడ్డి కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు ముగింపు సందర్భంగా రామగుండం యూనిట్ ఆఫీస్ నుంచి మున్సిపల్ చౌరస్తా వరకు 100 బైక్ లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారితో
ప్రతిజ్ఞ చేయించారు.