కరీంనగర్, వెలుగు: వివిధ రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులు తోటివారికి మార్గదర్శకులుగా నిలవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. యూత్ ఫర్ జాబ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సిటీలోని తారక హోటల్ లో బుధవారం నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తూ ఉపాధి కల్పిస్తున్న యూత్ ఫర్ జాబ్స్ సంస్థ తమ సేవలను గ్రామాలకు కూడా విస్తరించాలని సూచించారు.
దివ్యాంగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి స్థానికంగానే శిక్షణ ఏర్పాటు చేయాలని అన్నారు. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, యూత్ ఫర్ జాబ్ ఫౌండర్ మీరా శెన్నయ్, ప్రతినిధులు సమీర్ నాయర్, మధుసూదన్ పాల్గొన్నారు.
గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
ఈ నెల 15,16 తేదీల్లో గ్రూప్--2 పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్--2 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అభ్యర్థులు ఎగ్జామ్‌కు ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు.
ఆఫీసర్లు ఒకరోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మానిటరింగ్ అధికారి పవన్ కుమార్, గ్రూప్ 2 పరీక్ష ప్రాంతీయ కోఆర్డినేటర్లు సతీశ్‌కుమార్, వరలక్ష్మి పాల్గొన్నారు.