- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
కొత్తపల్లి, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లలోనే నైపుణ్యంతో కూడిన విద్య అందుతుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని జడ్పీ హైస్కూల్‌ను గురువారం ఉదయం సందర్శించారు. విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం స్కూల్‌లో విద్యాబోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 100 ప్రభుత్వ స్కూళ్లలో 200 మంది టీచర్లకు లైఫ్ స్కిల్స్ పై శిక్షణ ఇస్తున్నామని, వీరు విద్యార్థులకు క్లాస్ రూంలో బోధనతోపాటు ప్రయోగాత్మక విద్యను బోధిస్తారన్నారు.
భూమి విస్తీర్ణం, నేల రకం, కాలానికి అనుగుణంగా పంటల ఎంపిక, సేంద్రియ ఎరువులు, వాతావరణం అంచనా, మార్కెటింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన చేయడం లైఫ్ స్కిల్స్ విద్యలో భాగమని తెలిపారు. వీటి బోధనతో విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో అవగాహన పెంచుకుంటారన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, డీఈవో జనార్ధన్‌రావు, సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి, జన్య ఫౌండేషన్ మేనేజర్ సురేంద్రకుమార్, ఎంఈవో అజీమ్, తహసీల్దార్ రాజేశ్, హెచ్ఎం వెంకట పద్మాదేవి పాల్గొన్నారు.