సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ పమేలా సత్పతి 

సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ పమేలా సత్పతి 

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 4 నుంచి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై తహసీల్‌‌  ఆఫీస్‌‌ లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌‌ కు కలెక్టర్‌‌ ‌‌ , ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌ రెడ్డి, సీపీ గౌస్‌‌  ఆలం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

బారీకేడ్లు, లైటింగ్, తాగునీటి సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఇల్లందకుంట దేవస్థానం అతి పెద్దదని, బ్రహ్మోత్సవాలకు ఈసారి సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్​దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో రమేశ్‌‌ , తహసీల్దార్​రాణి, ఏసీపీ శ్రీనివాస్, ఈవో సుధాకర్ పాల్గొన్నారు.

 ఎల్ఆర్ఎస్‌‌  ఫీజు చెల్లింపునకు గడువు పొడగింపు

కరీంనగర్ టౌన్,వెలుగు: అనధికార లే అవుట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజుపై ప్రకటించిన 25 శాతం సబ్సిడీ ఈ నెల 30వరకు పొడిగించినట్లు కలెక్టర్ పమేలాసత్పతి బుధవారం తెలిపారు. మార్చి 31తో గడువు ముగియగా, ప్రజల అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గడువును  పొడిగించిందన్నారు. అర్హులందరూ ఈ వెసలుబాటును  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.