మహబూబ్ నగర్ బీఆర్ఎస్​ లీడర్లలో..అవిశ్వాస తీర్మానాల ఫికర్

మహబూబ్ నగర్ బీఆర్ఎస్​ లీడర్లలో..అవిశ్వాస తీర్మానాల ఫికర్
  •     ఇప్పటికే ఎంపీపీలపై నోటీసులు ఇస్తున్న అసమ్మతి నేతలు
  •     మున్సిపాలిటీల్లోనూ కదులుతున్న పావులు
  •     పార్టీ మారే యోచనలో ప్రజాప్రతినిధులు

వనపర్తి, వెలుగు: బీఆర్ఎస్  హయాంలో  మండల పరిషత్, మున్సిపాలిటీ పాలకవర్గాలు ఏకపక్షంగా వ్యవహరించాయని, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వారిని పదవి నుంచి తప్పించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. కాంగ్రెస్  పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాలకమండళ్లపై అవిశ్వాస అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.

మండల పరిషత్, మున్సిపాలిటీల్లో మెజారిటీ సభ్యులను ఒప్పించి ఎంపీపీలు, మున్సిపల్​ చైర్మన్లను పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మండలంలో ఏడుగురు ఎంపీటీసీలు ఉండగా, బీఆర్ఎస్ కు ఐదుగురు, కాంగ్రెస్ కు ఇద్దరు సభ్యులున్నారు. ముగ్గురు ఎంపీటీసీలు ఇటీవల కాంగ్రెస్ లో చేరడంతో వీరి బలం ఐదుకు చేరింది. దీంతో ఎంపీపీ చుక్క మాలతిని పదవి నుంచి దించేందుకు ఇటీవల అవిశ్వాస తీర్మానం కోసం అడిషనల్ కలెక్టర్ కు నోటీసు అందజేశారు. దీంతో జిల్లాలో అవిశ్వాస తీర్మానాలపై చర్చ మొదలైంది. వనపర్తి జిల్లాలో 15 మండలాలున్నాయి.

వీటిలో ఏదుట్ల మండలం కొత్తది కావడంతో 14 మండలాలకు పాలక  మండళ్లు ఉన్నాయి. వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలున్నాయి. మున్సిపాలిటీలు, మండల పరిషత్ లో అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేండ్లు పదవీ కాలం పూర్తి కావాల్సి ఉంటుంది. ఎంపీపీలు, మున్సిపల్  చైర్మన్లు, వైస్  చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టవచ్చు. జిల్లాల్లో రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతుండగా, ఎంపీపీలు మున్సిపల్  చైర్మన్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఏయే మండలాల్లో అవిశ్వాస తీర్మానం పెడతారనే అంశంపై చర్చ జరుగుతోంది.

వనపర్తి మున్సిపాలిటీలో..

వనపర్తి  మున్సిపల్  చైర్మన్  గట్టు యాదవ్ కు పదవీ గండం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 33 మంది కౌన్సిలర్లు ఉండగా, బీఆర్ఎస్ కు 25 మంది, కాంగ్రెస్ కు ఐదుగురు, టీడీపీకి ఇద్దరు, బీజేపీకి ఒక్క కౌన్సిలర్​ ఉన్నారు. ఇటీవల ఇద్దరు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. మరో పది మంది కాంగ్రెస్  పార్టీకి మారొచ్చని అంటున్నారు. దీంతో చైర్మన్ ను దించేందుకు అవసరమైన 17 మందిని సమీకరించుకునే పనిలో కాంగ్రెస్  పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.

వీరికి బీజేపీ సైతం మద్దతిచ్చి చైర్మన్, వైస్ చైర్మన్  పదవులు పంచుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరు  మున్సిపాలిటీలో 10 మంది కౌన్సిలర్లు ఉండగా, బీజేపీకి నలుగురు, బీఆర్ఎస్ కు ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్  కౌన్సిలర్లలో కొందరు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా మండల పరిషత్, మున్సిపాలిటీల్లో పార్టీల బలాబలాలు చూసుకొని అవిశ్వాసం కోసం పావులు కదుపుతున్నారు. దీంతో బీఆర్ఎస్​ లీడర్లకు ఎక్కడ తమ పదవులు పోతాయోనని భయం పట్టుకుంది.

పాలమూరులోనూ..

జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలని కొందరు కౌన్సిలర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ వార్డ్ కౌన్సిలర్  ఇంట్లో ఇటీవల 21 మంది కౌన్సిలర్లు సమావేశమయ్యారు. కొత్తగా మున్సిపల్​ చైర్​పర్సన్​ను ఎన్నుకోవాలనుకుంటున్నటలు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కొందరు కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, భూ ఆక్రమణలు చేసినట్లు పేర్కొన్నారు.

అయితే ఆరు నెలల వరకు వేచి ఉండాలని, అసంతృప్తి పక్కకు పెట్టి సమస్యలపై పోరాడాలని లక్ష్మారెడ్డి సూచించినట్లు సమాచారం. అయితే దీన్ని పట్టించుకోని కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత పాలకవర్గంలోని సభ్యులు దందాలు చేయడంతోనే బీఆర్ఎస్  పార్టీకి నష్టం జరిగిందని టాక్  నడుస్తోంది. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ తరువాత అవిశ్వాసం ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.