కరీంనగర్ సిటీ, వెలుగు: కేసీఆర్, కేటీఆర్, వినోద్ కుమార్ వలసపక్షులని, తాను పక్కా లోకల్ అని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కరీంనగర్ గడ్డ మీద పుట్టి, ఇక్కడే చదివి, ఇక్కడే పెరిగిన తన గురించి కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్‌లోని మంచిర్యాల రోడ్డు చౌరస్తా, భగత్ నగర్ చౌరస్తా, కశ్మీర్ గడ్డ రైతు బజార్ ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ఓ థర్డ్ గ్రేడ్ లీడర్ అని మండిపడ్డారు.
తాను చిన్నతనం నుంచి జగపతిరావు తనయుడిగా ఇక్కడ ప్రజలకు సుపరిచితుడినని, తన తండ్రి ఆశయాల సాధన కోసమే తాను ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు. స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో బండి సంజయ్ కుమార్, వినోద్ కుమార్ 30 శాతం వాటాను పంచుకున్నారని ఆరోపించారు. 2014 ఎన్నికల ప్రచారంలో తన భార్య పుస్తలు అమ్మి నామినేషన్ వేశానని ప్రకటించిన బండి సంజయ్ నేడు రూ.వందల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నాడని ప్రశ్నించారు.
అంతకుముందు కోతిరాంపూర్‌లోని ముకుందలాల్ మిశ్రా భవన్ సీపీఎం కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ లీడర్ల మద్దతు కోరారు. ఆయా కార్యక్రమాల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, లీడర్లు ఆకారపు భాస్కర్ రెడ్డి, కర్ర సత్య ప్రసన్నారెడ్డి, నడిపెల్లి అశోక్ రావు, సీపీఎం లీడర్లు మిల్కూరి వాసుదేవ రెడ్డి, గీట్ల ముకుంద రెడ్డి, సత్యం, జి.బీమా సాహెబ్ పాల్గొన్నారు.