- ఒకరు వెళ్లి రాగానే మరొకరి పయనం
- హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు..
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ కాంగ్రెస్ లీడర్లు టికెట్ల కోసం ఢిల్లీ బాట పట్టారు. మొన్నటి వరకు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రాష్ట్రంలోని ఇతర సీనియర్ నేతల చుట్టూ తిరిగిన ఆశావహులు ఇప్పుడు హస్తినకు క్యూ కడుతున్నారు. ఆగస్టులో హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నవారి నుంచి అప్లికేషన్లు కోరగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు మొత్తం 85 మంది అప్లయ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో అత్యధికంగా కరీంనగర్ నుంచి 15 దరఖాస్తులు అందాయి. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే కరీంనగర్ నుంచే ఆర్థికంగా, రాజకీయంగా బలమైన లీడర్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఢిల్లీలోని పార్టీ హైకమాండ్ ఆశీస్సుల కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.
ఎవరి ప్రయత్నం వారిదే..
కరీంనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం అప్లై చేసుకున్నవారిలో పీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు, ఏఐసీసీ మెంబర్ డాక్టర్ కొనగాల మహేశ్, మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ సహా 15 మంది ఉన్నారు. వీరిలో రోహిత్ రావు, డాక్టర్ కొనగాల మహేశ్, కొత్త జైపాల్ రెడ్డి. పురుమల్ల శ్రీనివాస్ మధ్యే టికెట్ విషయంలో తీవ్రంగా పోటీ ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే పీసీసీ నుంచి అధిష్టానానికి జాబితా వెళ్లడంతో వీరంతా ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీకి వెళ్లొస్తున్నారు. ఈ విషయంలో మేనేని రోహిత్ రావు ముందున్నారు.
ఆయన ఆగస్టులో రెండు సార్లు, ఇటీవల మరోసారి ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసొచ్చారు. ఆయన అక్కడ ఉండగానే బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. అంతేగాక రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ద్వారా ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కూడా కలిసి తనకు టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. రోహిత్ రావు, పురుమళ్ల శ్రీనివాస్ రాష్ట్రానికి చేరుకోగానే మంగళవారం మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి కూడా ఢిల్లీ బాటపట్టారు.
అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన.. పార్టీ అగ్రనేతలు సోనియా, ఖర్గే అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీకి ఒకరు వెళ్లి రాగానే మరొకరు పయనం కావడం కరీంనగర్ చర్చనీయాంశంగా మారింది.