కరీంనగర్ కాంగ్రెస్ టికెట్‌‌‌‌పై ఉత్కంఠ

  •     తెరపైకి తీన్మార్ మల్లన్న పేరు
  •     టికెట్ కోసం ప్రవీణ్‌‌‌‌రెడ్డి, రుద్ర సంతోష్, వెలిచాల రాజేందర్ రావు ప్రయత్నాలు
  •     ఆశావహుల్లో మరికొందరు లీడర్లు
  •     అభ్యర్థి డిక్లేర్ కాకపోవడంతో మొదలుకాని కాంగ్రెస్ ప్రచారం 

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరికీ కేటాయించకపోవడంతో బరిలో నిలిచే లీడర్ ఎవరనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి లోక్ సభ టికెట్‌‌‌‌ కేంద్ర మాజీ మంత్రి,  దివంగత నేత కాకా మనవడు గడ్డం వంశీకృష్ణకు కేటాయించిన విషయం తెలిసిందే. కరీంనగర్ టికెట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కరీంనగర్ టికెట్ కోసం ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

రుద్ర సంతోష్, వెలిచాల రాజేందర్ రావు పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా తీన్మార్ మల్లన్న పేరు కూడా ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు కూడా కరీంనగర్ లోక్ సభ పరిధిలో విజయావకాశాలపై ఆరా తీసినట్లు  తెలిసింది. 

బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్‌‌‌‌ వేట 

కరీంనగర్  లోక్‌‌‌‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ మరోసారి బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. బండి సంజయ్‌‌‌‌కు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ కారణంగా ఆయనకు గట్టి పోటీ ఇచ్చే నాయకుడి కోసం కాంగ్రెస్ హైకమాండ్‌‌‌‌ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే బండి సంజయ్ సామాజిక వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న పేరు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది.

సంజయ్ కు ఉన్నట్లే  తీన్మార్ మల్లన్నకు కూడా రాష్ట్రవ్యాప్తంగా యూత్‌‌‌‌లో ఫాలోయింగ్ ఉండడం, మాటలను తూటాల్లా పేల్చడంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై కొట్లాడి కేసులపాలైన ఘటనలన్నీ ఆయనకు కలిసొస్తాయని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్ లోక్‌‌‌‌సభ పరిధిలో బలమైన సామాజికవర్గంగా ఉన్న మున్నూరు కాపుల మద్దతు కూడా మల్లన్నకు ఉంటుందన్న భావనలో హైకమాండ్‌‌‌‌ ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ లోక్ సభ పరిధిలోని వివిధ పార్టీల లీడర్లతో మల్లన్నకు వ్యక్తిగత సంబంధాలు కూడా ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

మొదలు కాని ప్రచారం 

బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటికే ఒక దఫా కరీంనగర్ లోక్‌‌‌‌సభ నియోజవర్గాన్ని చుట్టేసి రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి  వినోద్ కుమార్ పండుగలు, ఉత్సవాలకు, మార్నింగ్ వాక్‌‌‌‌ల పేరుతో ప్రజలను కలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ఎవరికీ టికెట్ కేటాయించకపోవడంతో క్యాడర్ కొంత కన్ఫ్యూజన్ లో ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచిన ఉత్సాహంతో ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా క్యాండిడేట్‌‌‌‌ డిక్లేర్‌‌‌‌‌‌‌‌ కాకపోవడంతో శ్రేణులు కాస్త నిరుత్సాహంగా ఉన్నాయి. 

భారీగా ఆశావహులు..

కరీంనగర్ లోక్ సభ టికెట్ రేసులో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్​ రెడ్డి, ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ తోపాటు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వెలిచాల రాజేందర్ రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేత నేరేళ్ల శారద కూడా టికెట్ ఆశించినప్పటికీ.. ఆమెను తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించడంతో రేస్ నుంచి వైదొలిగినట్లయింది. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ కోసం

హుస్నాబాద్ టికెట్‌‌‌‌ను త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌‌‌‌రెడ్డి టికెట్ రేసులో ముందున్నట్లు తెలిసింది. ఒకవేళ ఈ టికెట్ ను బీసీలకు కేటాయిస్తే తనకే ఇవ్వాలని రుద్ర సంతోష్​ హైకమాండ్‌‌‌‌కు విన్నవించినట్లు సమాచారం. వీరిద్దరితోపాటు టికెట్ కోసం పోటీపడుతున్న మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగతిరావు తనయుడు రాజేందర్ రావు ప్రస్తుతం ఢిల్లీలో ఉండి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.