వాటర్ ప్లస్ సిటీ జాబితాలో కరీంనగర్

  •    ‌‌దేశంలోని 15 సిటీల్లో చోటు
  •     రాష్ట్రంలో హైదరాబాద్  తర్వాత సెకండ్  ప్లేస్ 
  •     ‌‌ఓడీఎఫ్​ డబుల్  ప్లస్ లో హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలు

కరీంనగర్ టౌన్, వెలుగు :  కరీంనగర్  కార్పొరేషన్ వాటర్  సిటీ ప్లస్​జాబితాలో చేరింది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన జాబితాలో మొత్తం 8 కార్పొరేషన్లు ఉండగా తెలంగాణ నుంచి  కరీంనగర్ కార్పొరేషన్​ స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూశుద్ధీకరణ నుంచి నీటి సప్లై వరకు వేస్టేజీ తక్కువగా ఉండడంతో ఆ జాబితాలో కరీంనగర్  నగరానికి స్థానం దక్కిందని వివరించారు. 

దేశంలోని 15  ప్రధాన నగరాల్లో కరీంనగర్ ఉండడం  గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్  తర్వాత  రెండో నగరంగా  కరీంనగర్ కు ఈ ఘటన దక్కిందని చెప్పారు. సిటీలోని డ్రైనేజీల్లో   మురుగు నీరు నిల్వకుండా ప్రత్యేక  చర్యలు తీసుకుంటున్నామని, అంతేకాకుండా డ్రైనేజీ నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూస్తున్నామని తెలిపారు. నదులు, గుంటలు, చెరువులు, తాగునీటి ప్రదేశాల్లో డ్రైనేజీ నీరు కలవకుండా నేరుగా ఎస్టీపీకి పంపిస్తున్నామని చెప్పారు. 

సిటీ వ్యాప్తంగా ఓపెన్  డ్రైనేజీ వ్యవస్థ లేకుండా చేయడంతో  డ్రైనేజీల్లోకి చెత్త చేరడం లేదని తెలిపారు. నగర ప్రజలు, పాలకవర్గం, సిబ్బంది సమిష్టి కృషితో ఈ అవార్డుకు కరీంనగర్  ఎంపికైందని పేర్కొన్నారు.  నిరుడు సఫాయిమిత్రలో  దేశంలోనే  రెండో స్థానాన్ని సాధించడంతో పాటు రూ.4 కోట్ల రివార్డు సాధించామని ఆయన గుర్తుచేశారు. అలాగే కరీంనగర్   జిల్లాలోని  హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి  మున్సిపాల్టీలు ఓడీఎఫ్​  డబుల్  ప్లస్  స్థానాలు  సాధించాయని మేయర్ సునీల్  రావు వెల్లడించారు.