
- రూ.100 కోట్ల వరకు వసూలు!
- సుమారు రూ.35 కోట్లు దుబాయ్ కి తరలింపు
- అక్కడే ఆస్తులు కొన్న నిందితుడు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పేరిట సుమారు రూ.వంద కోట్లకుపైగా వసూలు చేసి విదేశాలకు పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కిన రమేశ్ గౌడ్.. హవాలా మార్గంలో దుబాయ్ కి సుమారు రూ.35 కోట్లు తరలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదే కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో కరీంనగర్ సీఐడీ డీఎస్పీని ఇప్పటికే సరెండర్ చేశారు. ఉమ్మడి జిల్లాలో రెండేళ్లుగా క్రిప్టో కరెన్సీ పేరిట మల్టీలెవల్ మార్కెటింగ్ జోరుగా సాగుతోంది.
మధ్యతరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకుని ఇందులో ఎక్కువ మందిని చేర్పిస్తే ఫారిన్ టూర్లు, కమీషన్లు అని ఆశ చూపడంతో చాలా మంది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఈ బిజినెస్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.కోటి, రూ.2 కోట్లు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు. ఇలాంటి ఏజెంట్లలో రమేశ్ గౌడ్ ఒకడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన ఇతను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.100 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
డబ్బంతా ఇక్కడే ఉంటే ఎప్పటికైనా దొరికిపోతామని ముందుజాగ్రత్తతో అతడు హవాలా రూపంలో దుబాయ్ కి డబ్బులు పంపించాడు. దాదాపు రూ.35 కోట్ల వరకు డాలర్ల వరకు డ్రా చేసుకుని అక్కడే ఆస్తులు కొనుగోలు చేశాడు. అలా అక్కడ పదేళ్ల వరకు నివసించేలా వీసా కూడా సంపాదించాడని సీఐడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే విదేశాలకు చేరిన డబ్బును తిరిగి స్వాధీనం చేసుకోవడం సీఐడీ అధికారులకు చాలెంజ్ గా మారింది.
రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్న బాధితులు
ఇన్నాళ్లు పోలీస్ స్టేషన్లు, సీఐడీ ఆఫీసు చుట్టూ తిరిగిన బాధితులు.. రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీఐడీ డీఎస్పీ నిందితుడితో కుమ్మక్కయినట్లు ఆరోపణలు రావడం, విచారణలో జాప్యం జరుగుతుండడం, మనీ లాండరింగ్ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండడంతో కేసును సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.