కరీంనగర్ డెయిరీ బిల్డింగ్ కూల్చివేత ఎన్నడో?

కరీంనగర్ డెయిరీ బిల్డింగ్ కూల్చివేత ఎన్నడో?
  • గుండ్లపల్లి చెరువులో కట్టారని కూల్చివేతకు ఆదేశించిన ఎమ్మెల్యే  
  •  కబ్జా నిజమేనని నిర్ధారించి రిపోర్ట్ ఇచ్చిన రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు
  •  రెండు నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ డెయిరీ  బిల్డింగ్ ని  చెరువులో కట్టినట్టు నిర్ధారించి, రిపోర్ట్ ఇచ్చినా.. కూల్చేందుకు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు.   గన్నేరువరం మండలంలో  గుండ్లపల్లి దేవుని చెరువులో  10 గుంటల భూమిని ఆక్రమించి కరీంనగర్ డెయిరీ నిర్మించినట్టు.. ఎఫ్​టీఎల్ పరిధిలో రూల్స్ కు  విరుద్ధంగా నిర్మించిన డెయిరీని కూల్చి వేయాలని ఇప్పటికే పలుమార్లు సీపీఐ నేతలు ఆందోళన కూడా చేశారు. సర్వే నంబర్ 295లో 11 ఎకరాల్లో విస్తరించిన చెరువులో ఇప్పటికే ఎకరానికిపైగా కబ్జాకు గురైందనే ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్ 

గత సెప్టెంబర్ 2న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ డెయిరీని సందర్శించారు. పూర్తిగా చెరువులోనే కట్టారని, అసలు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ మరుసటి రోజు డెయిరీని పరిశీలించారు. సర్వే చేసి రిపోర్టు అందించాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సర్వే చేయగా 20 గుంటల్లో డెయిరీతో పాటు ఎదురుగా వైన్ షాపులోని కొంత భాగం చెరువులోని ఎఫ్ టీఎల్ పరిధిలో ఉందని నిర్ధారించి రిపోర్టు అందజేశారు.

రెండు నెలలు అయినా.. డెయిరీ కూల్చివేతపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. కొందరు ఆఫీసర్లు, లీడర్లు కబ్జాదారులకు అండగా నిలిచినందునే చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల పేరు చెప్పి ఏండ్ల తరబడి డెయిరీలో కీలక స్థానంలో అధికారాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ఓ పార్టీ లీడర్ తో సెటిల్ చేసుకుని డెయిరీని కూల్చివేయకుండా అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలిసింది. 

వెంటనే కూలగొట్టాలి

చెరువు శిఖంలో నిర్మించిన కరీంనగర్ డెయిరీని వెంటనే కూలగొట్టాలి. చెరువు భూమి కబ్జాకు గురైంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే డెయిరీని కూల్చాలని లేదంటే.. సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. 

- కాంతాల అంజిరెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి