- ఎస్సీ టీచర్ పోస్టింగ్ విషయంలో వివక్ష చూపారని ఆరోపణలు
- షోకాజ్ నోటీసు ఇచ్చిన ఎలక్షన్ కమిషన్
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ డీఈవో జనార్దన్‌రావు రోజుకో వివాదంలో చిక్కుతున్నారు. ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణమవుతున్నాయి. దీంతో టీచర్స్ యూనియన్లు తరచూ ధర్నాలకు దిగడం, నిరసన తెలపడం పరిపాటిగా మారింది. ప్రశ్నించిన టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా స్టూడెంట్, టీచర్ రేషియోకు అనుగుణంగా చేసే వర్క్ అడ్జస్ట్‌మెంట్‌లో రూల్స్ ఫాలో కాకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
రీపోస్టింగ్‌లో కులవివక్ష.?
టెన్త్ క్లాస్ స్పాట్ వ్యాల్యూయేషన్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే నెపంతో ముగ్గురు టీచర్లను గతంలో డీఈఓ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు టీచర్లకు గతంలో వారు పనిచేస్తున్న స్కూల్ లోనే పోస్టింగ్ ఇచ్చి, మరో దళిత టీచర్ పోతన శ్రీనివాస్‌ను మాత్రం వీణవంక మండలానికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ టీచర్స్ యూనియన్ ఈ నెల 30న ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో డీఈవో యూనియన్ బాధ్యులను పిలిపించుకుని తనకు రెండు రోజులు టైమ్ ఇవ్వాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇష్టారాజ్యంగా ట్రాన్స్‌ఫర్ చేయడంపై డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య డీఈవోకు ఫిర్యాదు చేయగా..
డీఈవోపై చర్యలు తీసుకోవాలంటూ స్టేట్ ఎలక్షన్ కమిషనర్.. కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఎస్జీఎఫ్ సెక్రటరీగా పని చేస్తున్న శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేయడం కూడా వివాదాస్పదంగా మారింది. అలాగే తన ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డి.మాధవికి పెద్దపల్లి డీఈవోగా అడిషనల్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఏడీగా ఆమె కొనసాగుతున్నా ఆ బాధ్యతలను ఆఫీస్ సూపరింటెండెంట్ నరసింహస్వామికి అప్పజెప్పడంపై కూడా అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.
ఇంటి అద్దె పేరిట నకిలీ బిల్లులు..
డీఈఓ జనార్దన్‌రావు కరీంనగర్‌లోని రేకుర్తి సూర్యనగర్ లో ఓ టీచర్ ఇంట్లో కిరాయికి ఉంటున్నప్పటికీ.. గత ఏడాది ఐటీ రిటర్న్స్ లో మాత్రం కోతిరాంపూర్‌లోని సత్యనారాయణ ఇంట్లో కిరాయికి ఉంటున్నట్లు, నెలనెలా రూ.36 వేలు రెంట్ చెల్లిస్తున్నట్లు చూపించారు. ఇలా ఏడాదికి రూ.4,32,000 అద్దె చెల్లించినట్లు రిసిప్ట్ లు జతచేశారు. కానీ సదరు సత్యనారాయణ పేరు మీద మున్సిపల్ రికార్డుల ప్రకారం ఇల్లే లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఐటీ నిబంధనలను బ్రేక్ చేయడమేననే టీచర్ల సంఘాలు చెబుతున్నాయి.