
- ఐదేళ్లలో కరీంనగర్‌కు కలిసొచ్చిన స్మార్ట్స్ సిటీ, సీఎంఏ ఫండ్స్
- ఇంకా పదుల సంఖ్యలో అసంపూర్తి పనులు
- విలీన గ్రామాల్లో అభివృద్ధి అంతంతమాత్రమే..
- నేటితో ముగియనున్న పాలకవర్గం గడువు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగియబోతుంది. తమ డివిజన్లను అభివృద్ధి చేస్తామని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని గెలిచిన కార్పొరేటర్లకు స్మార్ట్ సిటీ ఫండ్స్, సీఎం అస్యూరెన్స్ ఫండ్స్ కలిసొచ్చాయి. సుమారు రూ.700 కోట్ల మేర స్మార్ట్ సిటీ ఫండ్స్, మరో రూ.240 కోట్లు సీఎం అస్యూరెన్స్ ఫండ్స్‌తో కరీంనగర్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. అయితే ఇంకా పదుల సంఖ్యలో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
మెయిన్ సిటీలో రోడ్లు, డ్రైనేజీలు, పార్క్‌లు, మార్కెట్లు తదితర అభివృద్ధి పనులు పూర్తయినప్పటికీ.. విలీన గ్రామాల్లో ఆశించిన అభివృద్ధి జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.232 కోట్లు విడుదల చేయడంతో చాలా పనులు పూర్తయ్యాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్మార్ట్ సిటీ పనులు
కరీంనగర్ సిటీ 2017లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుత పాలకవర్గం వచ్చే వరకు పెద్దగా పనులు మొదలుకాలేదు. 2020లో కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టాక పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులో రూ.936.80 కోట్లతో 48 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేయగా ఇందులో మల్టీపర్పస్ పార్క్, అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, బుల్ చమన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు, హౌసింగ్ బోర్డు కాలనీలో 24/7 తాగునీటి సరఫరా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇ క్లాస్ రూమ్స్, స్కూళ్ల ఆధునీకరణ పనులు, దోబీ ఘాట్, రోడ్లు.. తదితర 35 రకాల పనులు పూర్తయ్యాయి. కిసాన్ నగర్, కశ్మీర్ గడ్డ మార్కెట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, లైబ్రరీ భవనం, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు 80–90 శాతం వరకు పూర్తయ్యాయి. బయో మైనింగ్ సగం కూడా కాలేదు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, స్మార్ట్ సిటీ సైన్ బోర్డ్స్ టెండర్ దశలో ఉన్నాయి.
సీఎం అస్యూరెన్స్ ఫండ్స్ తో రహదారులు, అంతర్గత రోడ్లు, పట్టణ ప్రగతి నిధులతో ఓపెన్ జిమ్‌లు, హైమాస్ట్ లైట్లు, పారిశుద్ధ్య పనుల నిర్వహణకు కొత్తగా ట్రాక్టర్లు, ఆటోలు, ట్యాంకర్లు కొనుగోలు చేశారు. పలుచోట్ల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. జనరల్ ఫండ్స్ తో సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు నిర్మించారు.
అభివృద్ధి పనులపై అవినీతి ఆరోపణలు
కరీంనగర్‌లో గత ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని, అవినీతి జరగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పనులపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కూడా స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని కొన్నాళ్ల కింద బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తాజాగా మేయర్ సునీల్‌రావు కూడా కరీంనగర్ సిటీలో జరిగిన అభివృద్ధి పనులపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అందరూ ఆరోపణలు చేస్తే.. తప్పెవరు చేశారని సిటీ జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అవార్డులు..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదేళ్లలో సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్‌లో పోటీపడి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 3 లక్షల జనాభా కేటగిరీలో జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించి రూ.4 కోట్ల నగదు పురస్కారాన్ని సాధించింది. స్వచ్చ సర్వేక్షణ్, వాటర్ ప్లస్ స్థానాన్ని పదిలపర్చుకుంది.
అమృత్‌సిటీ పథకంలో భాగంగా ‘పే జల్‌సర్వేక్షణ్’లో మెరుగైన పనితీరుతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిరుడు జాతీయ అవార్డుకు ఎంపికైంది.
ఇటీవల అమృత్ 2.0 కింద ఇటీవల హౌసింగ్ బోర్డు కాలనీలో 24 గంటల తాగునీటి సరఫరాను ప్రారంభించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి సిటీగా కరీంనగర్ రికార్డు నెలకొల్పింది.