- ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఓటర్లు 8,496 మంది
- ఎన్నికల సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ బూత్‌లు సిద్ధం చేస్తున్న అధికారులు
- ఉమ్మడి జిల్లాలోని 62 మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు స్థానాలకు, 1218 జీపీలకు ఎన్నికలునిర్వహించే చాన్స్
- కులగణన పూర్తవడంతో రిజర్వేషన్ల పెంపుపై బీసీల్లో ఉత్కంఠ
- లీడర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహుల ప్రయత్నం
కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్షన్స్ కమిషన్ గ్రామపంచాయతీల ఓటర్ లిస్ట్ ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంతో పోలిస్తే ఓటర్లు పెరిగారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే పూర్తవడంతో రిజర్వేషన్ల పెంపుపై బీసీల్లో ఉత్కంఠ నెలకొంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతారన్న ఆశలో బీసీ వర్గానికి చెందిన ఆశావహులు ఉన్నారు. కాగా రిజర్వేషన్ల అంశం ఫైనల్ కాగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే చాన్స్ ఉంది. ఈమేరకు ఉమ్మడి జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ బూత్‌లు, సిబ్బంది, బ్యాలెట్ బ్యాక్సులు ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటికే ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు.
1218 జీపీలకు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1214 గ్రామపంచాయతీల్లో 11,132 వార్డులు ఉన్నాయి. వీటికి ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించే అవకాశం ఉంది. వీటితోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఏ ఎన్నిక ముందు నిర్వహిస్తారనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది. జగిత్యాల జిల్లాలో 20 మండలాలు, కరీంనగర్ జిల్లాలో 15, పెద్దపల్లి జిల్లాలో 14, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితోపాటు జగిత్యాల జిల్లాలో కొత్తగా ఏర్పాటైన బీమారం, ఎండపల్లి మండలాల్లో ఏర్పడగా వీటికి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.
పెరిగిన ఓటర్లు
అక్టోబర్‌లో ప్రకటించిన ఉమ్మడి జిల్లా ఓటర్ల సంఖ్య తాజాగా 8,496 మంది ఓటర్లు పెరిగారు. గతంలో 29,90,319 మంది ఓటర్లు ఉండగా తాజాగా ప్రకటించిన లిస్ట్‌లో 29,98,815 మందికి పెరిగారు. కరీంగనగర్ జిల్లాలో 10,82,751 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 5,30,337, మహిళలు 5,52,353 , ఇతరులు 61 మంది ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఓటర్లు 7,17,390 మంది ఉండగా, మహిళలు 3,63,607, పురుషులు 3,53,732, ఇతరులు 51 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లాలో 7,20,803 మంది ఓటర్లు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4,76,345 మంది ఓటర్లలో మహిళలు 2,47,048, పురుషులు 2,29,352, ఇతరులు 37 మంది ఉన్నారు.
రిజర్వేషన్లపై బీసీల ఆశలు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈమేరకు కులగణన ప్రారంభించి పూర్తి చేశారు. బీసీల సంఖ్య ప్రకటించడంతో పాటు జనాభాకు అనుగుణంగా సీట్లు కేటాయిస్తారన్న ఆశలో ఆ వర్గం నేతలు ఉన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ఆనాడు అమల్లోకి తెచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పదేళ్లు అవే రిజర్వేషన్లు ఉండాలి. కానీ ప్రస్తుతం సర్కార్ఆ చట్టాన్ని అనుసరిస్తుందా లేక కొత్తగా రిజర్వేషన్లలో మార్పు తెస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాగే ఎస్సీ వర్గీకరణ అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మరో డిమాండ్ కూడా ఉంది. దీంతో సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని లోకల్ లీడర్లు ఎదురుచూస్తున్నారు.
ALSO READ : సిరిసిల్ల భూ దందా విలువ 1000 కోట్లు!
ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు
మరో కొద్దిరోజుల్లోనే లోకల్‌బాడీస్ ఎలక్షన్స్నోటిఫికేషన్ వస్తుందనే సంకేతాలు రావడంతో ఆశావహులంతా ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ పార్టీకి విధేయులు, పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. ఈక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు డైలమాలో పడ్డట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందు, తర్వాత చాలామంది బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ టైంలో కొందరు ఎమ్మెల్యేలు వారికి టిక్కెట్ల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్కార్ తాజా నిర్ణయంతో ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని నమ్ముకొని ఉన్న వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యమిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఎమ్మెల్యే, జిల్లా నాయకులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.