మంథని, వెలుగు: ఇంటింటి సర్వే ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం పట్టణంలోని శ్రీరామ్ నగర్ 4 వ వార్డు లో ఇంటింటి సర్వే సన్నద్దత, వ్యవసాయం మార్కెట్ యార్డు, ఎంసీహెచ్ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సర్వే కోసం హౌస్ లిస్టింగ్ పక్కాగా చేపట్టాలని, వేరే బృందాలు సర్వే చేయాల్సి వచ్చిన ఎటువంటి ఇబ్బందులు రాకుండా మ్యాపింగ్ ఉండాలని సూచించారు. ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటే వేర్వేరుగా వివరాలు సేకరించాలని చెప్పారు.
వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం ఎక్కడా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మంథనిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందుల స్టాక్ వివరాలను కలెక్టర్ పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా అవసరమైన మేర మందులను ఎప్పటికప్పుడు పంపాలని సూచించారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లను పరిశీలించి జనరల్ వార్డ్, ఎక్స్ రే రూమ్ లలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆయన వెంట మంథని ఆర్డీఓ సురేశ్, తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ మనోహర్, రామగుండం తహసీల్దార్ కుమార స్వామి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.