- కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కొత్తపల్లి, రామడుగు, వెలుగు: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శని, ఆదివారాలు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకరంపుర వాణీనికేతన్ పాఠశాలలో, కొత్తపల్లి పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, రామడుగు మండలం వెదిర ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండే వారు ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, మరణించిన వారి ఓట్లను తొలగించడంతోపాటు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నివాసాన్ని మార్చిన ఓటర్లు సైతం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.