చిత్తడి చిత్తడిగా సర్కార్ దవాఖాన.. ఉరుస్తున్న హాస్పిటల్ బిల్డింగ్

పెచ్చులూడుతున్న స్లాబ్ తడిచిన  ఫ్లోర్లతో జారిపడుతున్న 
పేషెంట్లు, అటెండెంట్లుబురదమయంగా మారిన హాస్పిటల్ ఆవరణ

కరీంనగర్/ కరీంనగర్ టౌన్, వెలుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా హాస్పిటల్ చిత్తడిగా మారింది. బిల్డింగ్ పైకి పటిష్టంగానే కనిపిస్తున్నప్పటికీ.. లోపల మొత్తం ఉరుస్తోంది. గోడలు, స్లాబ్ వానలకు నాని పెచ్చులూడుతున్నాయి. ఫ్లోర్లపైకి నీరు చేరడంతో పేషెంట్లకు, అటెండెంట్లకు నడవడం ఇబ్బందికరంగా మారింది. టైల్స్ తో కూడిన ఫ్లోర్ కావడంతో నడిచే క్రమంలో పలువురు జారిపడినట్లు పేషెంట్ల బంధువులు చెబుతున్నారు. వార్డుల్లోనూ స్లాబులు ఉరుస్తుండడంతో ఇదే పరిస్థితి నెలకొంది. ట్రీట్ మెంట్ కు వచ్చే రోగులకు కొత్త రోగాలు అంటుకునేవిధంగా హాస్పిటల్ వాతావరణం ఉందని పేషెంట్లు,బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పెచ్చులూడుతున్న స్లాబ్ 

జిల్లా హాస్పిటల్ కు కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, హుస్నాబాద్ నుంచి నిత్యం వందలాది మంది నిరుపేద పేషెంట్లు వస్తుంటారు. కరీంనగర్ మెడికల్ కాలేజీ మంజూరైన తర్వాత జిల్లా హాస్పిటల్ ను ఇటీవల టీచింగ్ హాస్పిటల్ గా మార్చినప్పటికీ సౌకర్యాలు మాత్రం మెరుగుపరచలేదు. వర్షపు నీటితో హాస్పిటల్ ఓల్డ్ బిల్డింగ్ స్లాబు పెచ్చులు ఊడిపడుతుండడంతో ఇన్ పేషెంట్లు, హాస్పిటల్ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాగే వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు జాగ్రత్తలు చెప్పే వైద్య, ఆరోగ్య శాఖే హాస్పిటల్ పరిసరాల పరిశుభ్రతను పట్టించుకోవడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నీరు చేరి జిల్లా హాస్పిటల్ ఆవరణ అంతా బురదమయంగా మారింది. వర్షం ఎక్కువగా కురిసినప్పుడు ఆవరణలో నీళ్లు చేరి కుంటను తలపిస్తోంది. 

జనరల్ వార్డుల్లోనే టీబీ పేషెంట్లకు ట్రీట్ మెంట్.. 

జిల్లా హాస్పిటల్ లో టీబీ పేషెంట్లను జనరల్ వార్డులోనే ఉంచి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. వారు దగ్గినప్పుడల్లా మిగతా పేషెంట్లు తమకూ టీబీ సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఈ విషయమై హాస్పిటల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్,హైదరాబాద్ లోని ప్రభుత్వ దవాఖానల్లో టీబీ పేషెంట్ల కోసం ప్రత్యేక వార్డులు, హాస్పిటల్స్ ఉండగా, కరీంనగర్ లో మాత్రం జనరల్ వార్డుల్లోనే ట్రీట్ మెంట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కంపు కొడుతున్న టాయిలెట్స్.. 

హాస్పిటల్ లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేక టాయిలెట్స్ కంపుకొడుతున్నాయి. దీంతో పేషెంట్లు, వారి బంధువులు టాయిలెట్ కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. ముక్కు మూసుకుని టాయిలెట్స్ కు వెళ్లాల్సి వస్తోంది. వాటి పక్కనే బెడ్స్ ఉన్న రోగులు, బంధువుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. 

డాక్టర్ల గైర్హాజర్.. 

వర్షాలతో డయేరియా, డెంగ్యూ, జ్వరం తదితర సీజనల్ వ్యాధులు విజృంభించే ఈ సమయంలో డాక్టర్లు విధిగా డ్యూటీకి రావాల్సి ఉన్నప్పటికీ చాలా మంది డుమ్మా కొడుతున్నారు. హాస్పిటల్ లో వివిధ విభాగాలకు చెందిన  64 మంది డాక్టర్లు డ్యూటీ చేస్తున్నప్పటికీ వీళ్లలో సగం మంది కూడా కనిపించడం లేదు. ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఉండాల్సిన డాక్టర్లు 11 దాటిన తర్వాత వచ్చి ఒంటి గంట లోపే వెళ్లిపోతున్నారని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నడవాలంటేనే భయమైతుంది.. 

నా కొడుకుకు బాగోలేక దవాఖానకు తీసుకొచ్చిన. వర్షాలతో దవాఖాన ఉరుస్తున్నది. ఎక్కడ చూసినా కింద నీళ్లే కనిపిస్తున్నయ్. హాస్పిటల్ లో నడుస్తుంటే జారి పడతనేమోనని భయమైతంది.   
- దూడం కుమార్, ఊటూరు, మానకొండూర్​