ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనవాళ్లే కీలకం

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనవాళ్లే కీలకం
  • గ్రాడ్యుయేట్​, టీచర్​ ఓటర్లలో ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వాళ్లే ఎక్కువ
  • మొత్తం 3,55,159 మంది ఓటర్లలో 1,60,260 లక్షల మంది ఇక్కడోళ్లే
  • గతంతో పోలిస్తే పెరిగిన లక్షన్నర మంది గ్రాడ్యుయేట్లు
  • ఇందులోనూ మహిళా ఓటర్లు తక్కువ.. పురుషులు ఎక్కువ 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెదక్, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ  ఓటర్ల తుది జాబితా విడుదలైంది. 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి 3,55,159 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు  ఉండగా.. వీరిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 1,60,260  మంది ఉన్నారు. 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,96,321 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా.. ఈ సారి అదనంగా 1,58,838 మంది నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న  అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ నియమించిన బృందాలే ఎక్కువగా ఓట్లు నమోదు చేయించినట్లు తెలుస్తోంది.

వీటితోపాటు టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 27,088 మంది ఉండగా.. ఉమ్మడి జిల్లాలో 8,135 మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులంతా ఈ జిల్లాపైనే ఫోకస్ పెంచారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రచారం చేస్తున్నారు. 

మహిళలు తక్కువ.. పురుషులు ఎక్కువ 

గ్రాడ్యుయేట్లు, టీచర్లలో పురుషులు ఎక్కువ మంది ఉండగా.. మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 71,545 మందిలో 42,806 మంది పురుషులు ఉంటే, 28,739 మంది మహిళలు, జగిత్యాల జిల్లాలోని 35,281 మంది గ్రాడ్యుయేట్లలో 21,667 మంది పురుషులు, 13,614 మంది మహిళలు, పెద్దపల్లి జిల్లాలో 31,037 మంది గ్రాడ్యుయేట్లలో 19,008 మంది పురుషులు, 12,028 మంది మహిళలు, ఒక థర్డ్ జండర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22,397 మంది గ్రాడ్యుయేట్లలో 13,772 మంది పురుషులు, 8,625 మంది మహిళలు ఉన్నారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తంగా 97,253 మంది(60.60 శాతం) పురుషులు ఉంటే 63,006(39.40 శాతం)  మహిళలు ఉన్నారు.  నాలుగు ఉమ్మడి జిల్లాలో కలిపి 2,26,765(64 శాతం)   మంది పురుషులుఉంటే, 1,28,392(36 శాతం) మంది  మహిళలు, ఇద్దరు థర్డ్ జండర్స్ ఉన్నారు.

ప్రైవేట్ టీచర్లకు ఈ సారి ఓటింగ్ అవకాశం.. 

గతంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లకు మాత్రమే ఓటింగ్ కు అవకాశం ఉండేది. కానీ ఈసారి ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న అర్హులైన టీచర్లు, లెక్చరర్లకు కూడా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 27,088 మంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

వీరిలో 16,932 మంది పురుషులు ఉండగా, 10,156 మంది మహిళలు ఉన్నారు. 2019లో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23,214 మంది టీచర్లుగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ లెక్కన ఈ సారి అదనంగా 3 వేల నుంచి 4 వేల మంది ప్రైవేట్ విద్యాసంస్థల టీచర్లు, లెక్చరర్లు ఎన్ రోల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


కరీంనగర్               71,545

రాజన్న సిరిసిల్ల    22,652

పెద్దపల్లి                 31,037

జగిత్యాల               35,281

మొత్తం                  1,60,260 

 

ఉమ్మడి మెదక్              70,713 

ఉమ్మడి ఆదిలాబాద్     69,134 

ఉమ్మడి నిజామాబాద్    47,984