ఓవర్ స్పీడ్‌తో ప్రాణాలు తీస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు
- రాష్ డ్రైవింగ్ తో వాహనదారులు, ప్రజలు బెంబేలు
- తిమ్మాపూర్, మానకొండూరు, రూరల్ మండలాల్లో ఊరూరా ఇసుక డంపులు
- పోలీస్, రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతోనే అక్రమ రవాణా
- డ్రైవర్లలో లైసెన్స్ లు లేనివాళ్లే ఎక్కువ
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఇటు మానేరు వాగుతోపాటు అటు మోయతుమ్మెద వాగులో టన్నుల కొద్దీ ఇసుకను తరలిస్తూ కోట్లాది రూపాయలను వెనుకేసుకుంటున్నారు. జిల్లాలో కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, ఇరుకుల్ల, చేగుర్తి, ముగ్దుంపూర్ తోపాటు మానకొండూరు మండలం శ్రీనివాస నగర్, వేగురుపల్లి, ఊటూరు, వెల్ది, తిమ్మాపూర్ మండలం రేణిగుంట, కొత్తపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో ఈ దందా జోరుగా నడుస్తోంది. ఇటు పోలీసులు, అటు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్తూ వారి అండతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతోంది.
అనుమతులు లేకపోయినా పగలు, రాత్రీ తేడా లేకుండా రోజూ వందలాది ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. కేవలం ఈ ఇసుక మాఫియాను నమ్ముకునే కొందరు ఆఫీసర్లు ఈ దందా నడిచే మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకుంటున్నారంటే.. ఇసుక దందా ఏ స్థాయిలో కాసుల వర్షం కురిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ దందాలో తెర వెనక చక్రం తిప్పేది అంతా అధికార పార్టీ నేతలేనన్న ఆరోపణలు ఉన్నాయి.
గ్రామాల్లో ఇసుక డంపులు
ఎండాకాలంలో ఇసుకను ఎప్పటికప్పుడు వాగుల నుంచి తరలించిన ఇసుక మాఫియా.. వర్షాకాలం మొదలు కావడంతో డంపింగ్‌పై దృష్టి పెట్టింది. వర్షాలు పడి వాగులు సాగితే ఇసుక కొరత ఏర్పడే పరిస్థితి ఉండడంతో ముందస్తుగా తరలించి గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో డంప్ చేస్తున్నారు. తిమ్మాపూర్ మండలం మోయతుమ్మెద వాగు ఒడ్డున, రాజీవ్ రహదారి వెంట గతంలో టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించి మూతపడిన క్వారీల్లో గుట్టలకొద్దీ ఇసుక నిల్వలు ఉన్నాయి. రోజూ రాత్రి ఇక్కడి నుంచి ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇసుక నిల్వల విషయమై అడిగితే ఇటు రెవెన్యూ ఆఫీసర్ల నుంచి గానీ, అటు మైనింగ్ ఆఫీసర్ల నుంచి గానీ ఎలాంటి సమాధానం లేదు. హైవే వెంట గుట్టలుగా ఇసుక నిల్వలు కనిపిస్తుంటే.. వాటి గురించి తమకు సమాచారం లేదని సదరు ఆఫీసర్లు సమాధానమివ్వడం గమనార్హం.
అలాగే ఇదే మండలం రేణికుంట, కొత్తపల్లి, గొల్లపల్లి తదితర గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో పదుల సంఖ్యలో భారీ ఇసుక డంపులు 'వీ6 వెలుగు' పరిశీలనలో వెలుగు చూశాయి. ఇసుక మాఫియాను నడిపించే లీడర్లు ఒక్కో ట్రాక్టర్ నుంచి నెలకు రూ.20 వేల చొప్పున వసూలు చేసి ఆఫీసర్లకు ముడుపులు ముట్టజెప్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లారీలు బందైనా.. ట్రాక్టర్లు ఆగుతలే..
జిల్లాలో ఇసుక తవ్వకాలు, క్వారీల నిర్వహణపై ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో క్వారీలన్నీ బంద్ అయ్యాయి. లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా నిలిచిపోయినప్పటికీ ట్రాక్టర్ల ద్వారా రవాణా ఆగడం లేదు. పైగా గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్లు నడస్తున్నట్లు వాగు సమీపంలోని గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ట్రాక్టర్లు నడుపుతున్న వారిలో మైనర్లు, సిక్స్ వీలర్స్ సంబంధించిన బ్యాడ్జీ లైసెన్స్ లేనివాళ్లే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రాణాలు తీస్తున్న ఇసుక ట్రాక్టర్లు..
సోమవారం రాత్రి అర్ధరాత్రి తిమ్మాపూర్ మండలం రేణిగుంట శివారులో ఇసుక ట్రాక్టర్ రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టడంతో శివరాత్రి ఆంజనేయులు, సంపత్, గుడిపల్లి అరవింద్ అనే ముగ్గురు యువకులు చనిపోయారు.
నెల క్రితం కరీంనగర్ మండలం దుర్శేడు గ్రామానికి చెందిన గాజుల రాజును ఇసుక ట్రాక్టర్ ను ఢీకొనడంతో చనిపోయాడు.
రెండేళ్ల క్రితం కరీంనగర్ మండలం దుర్శేడు గ్రామంలో వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను అదే గ్రామానికి చెందిన కుమార్ అనే యువకుడు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ ఢీకొనడంతో కుమార్ చనిపోయాడు.
నిరుడు ఏప్రిల్ 13న ఇసుక లోడ్ తో దుర్శేడ్ మీదుగా వెళ్తున్న ఇసుక లారీ జీవనోపాధి కోసం వచ్చిన బాలుడు నడుచుకుంటూ వెళ్తుండగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు స్పాట్‌లోనే చనిపోయాడు.
జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో 15 రోజుల క్రితం ఇసుక ట్రాక్టర్, కారు ఢీకొనగా కారులో ఉన్న వల్లాల సాంబయ్య, రావికంటి వీరారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.