సిరిసిల్ల టౌన్, వెలుగు : పట్టణ సుందరీకరణలో భాగంగా కలెక్టర్ ఆఫీస్ వద్దగల రగుడు జంక్షన్ అభివృద్ధికి సుమారు రూ.3 కోట్ల10 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ తెలిపారు. సోమవారం మున్సిపల్ ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి కోసం రూపొందించిన 29 అంశాలను పాలకవర్గ సభ్యులతో చర్చించి 28 అంశాలను చైర్పర్సన్ ఆమోదించారు. సమావేశంలో కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
‘సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ’
తిమ్మపూర్, వెలుగు : సీసీ కెమెరాల ఏర్పాటుతోనే మండలంలో నేరాలను నియంత్రించవచ్చని తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్ఎదురుగాగల శంకర్ హోమ్స్ లో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్ రెడ్డితో కలిసి శశిధర్ ప్రారంభించారు. ఇటీవల జరిగిన అనేక ప్రమాదాల్లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయన్నారు. అనంతరం విల్లాస్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించారు.
సింగరేణిలో 104 శాతం బొగ్గు ఉత్పత్తి
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్ పరిధి ఆర్జీ 2 డివజన్‌లో 104 శాతం బొగ్గు ఉత్పత్తి చేశారు. సోమవారం జీఎం ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో జనరల్ మేనేజర్ ఎ.మనోహర్ వివరాలు వెల్లడించారు. అక్టోబర్ నెలలో ఆర్జీ 2 ఏరియాకు 7.47 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించగా 7.76 లక్షల టన్నులు ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. 7,98,013 టన్నులు బొగ్గు రవాణా చేశామన్నారు. మీటింగ్‌లో జీఎం సాంబయ్య, వకీల్ పల్లి ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
డ్రైనేజీలో పడి యువకుడు మృతి
మెట్ పల్లి, వెలుగు: అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీలో పడి యువకుడు చనిపోయిన ఘటన పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు జరిగింది. కామారెడ్డి జిల్లాకు చెందిన గణేశ్(30) రెండేళ్ల క్రితం మతిస్థిమితం లేకుండా మెట్ పల్లి కి వచ్చి ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల ఉండేవాడు. వారం రోజులుగా గణేశ్బస్టాండ్ వద్ద కనిపించకపోవడంతో చుట్టుపక్కల దుకాణాల్లోని సీసీ కెమెరాలు తనిఖీ చేశారు. దీంతో గణేశ్డ్రైనేజీలో పడిపోతున్న దృశ్యాలు ఓ దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. గణేశ్అక్టోబర్23న ఫిట్స్ వచ్చి డ్రైనేజీలో పడిపోయాడు. బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించి చివరికి అందులోనే పడి చనిపోయినట్లు సీసీ కెమెరాలో కనిపించింది.
నంబర్ ప్లేట్లు లేని 71 వాహనాలు సీజ్
సుల్తానాబాద్, వెలుగు: పట్టణంలోని కాల్వ శ్రీరాంపూర్ చౌరస్తా వద్ద సోమవారం నిర్వహించిన వాహనాల తనిఖీలో నంబర్ ప్లేట్లు లేని 71 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు. మద్యం తాగి వెహికల్స్నడిపితే జైలు శిక్ష తప్పదన్నారు. ఆయన వెంట సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై లు ఉపేందర్, వినీత తదితరులు పాల్గొన్నారు.
ఫండ్స్ ఇస్తలేరని బీజేపీ కౌన్సిలర్ భిక్షాటన
రాజన్న సిరిసిల్ల, వెలుగు : మున్సిపల్ పాలక వర్గం తన వార్డుకు నిధులు కేటాయించడంలేదని సిరిసిల్ల 10వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బొల్గం నాగరాజు సోమవారం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేండ్ల క్రితం తమ వార్డుకు సంబంధించిన గ్రామాలను మున్సిపల్ లో విలీనం చేసినప్పటి నుంచి చిన్నబోనాల, పెదబోనాల గ్రామాలను మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ పట్టించుకోవడంలేదన్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిధులివ్వడంలేదని వాపోయారు.
ఆపరేషన్ వికటించి మహిళ మృతి.. డాక్టర్‌పై కేసు నమోదు
పెద్దపల్లి, వెలుగు: డాక్టర్ నిర్లక్ష్యంతో ఆపరేషన్వికటించి మహిళ చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. వారి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి పూసాలకు చెందిన మెరుగు లక్ష్మి(50) పది రోజుల క్రితం ఆర్ధో సమస్య(కాలికి)తో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అయితే అందులో పనిచేస్తున్న డాక్టర్ ట్రీట్మెంట్ కోసం తన ప్రైవేట్ ఆస్పత్రికి పంపించినట్లు తెలిపారు. ట్రీట్మెంట్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసుకుని, చివరికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేసినట్లు బంధువులు వెల్లడించారు. సర్జరీ పూర్తయిన 10 రోజుల తర్వాత సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రిలోనే లక్ష్మి అస్వస్థతకు గురైంది. వెంటనే లక్ష్మిని వైద్యులు కరీంనగర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే లక్ష్మి మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించి లక్ష్మి చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు చిన్నకల్వల రహదారిపై ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కరీంనగర్‌కు తరలించారు. డాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో టీచర్
వేములవాడ, వెలుగు : వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ పై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపారు. కొద్ది రోజులుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని స్టూడెంట్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా డీఈఓ సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి
చొప్పదండి, వెలుగు: పట్టణంలోని ఎస్సారెస్పీ కాలువలో శనివారం సాయంత్రం ఎడ్ల బండితో సహ గల్లంతైన పొన్నం రాజేశం(46) మృతదేహం కొత్తపల్లి మండలం చింతకుంట గేటు వద్ద లభ్యమైంది. రాజేశం ఊరు శివారులో గుర్రం వెంకట్‌రెడ్డికి చెందిన పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. శనివారం సాయంత్రం పనులు ముగించుకొని ఎడ్లబండిని తోలుకుంటూ కాలువ వెంట ఇంటికి వస్తుండగా ఎడ్లు బెదిరిపోయి బండిని కాలువలోకి లాక్కెళ్లాయి. దీంతో బండిపై ఉన్న రాజేశం కాలువలో పడిపోయినట్టు చొప్పదండి ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. రెండు రోజుల పాటు నీటి ప్రవాహాన్ని తగ్గించి వెతకగా సోమవారం ఉదయం చింతకుంటలోని ఎస్సారెస్పీ కెనాల్ రెగ్యూలేటర్ రాజేశం మృతదేహం దొరికినట్లు చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
చొప్పదండి, గంగాధర, బోయినిపల్లి, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. సోమవారం ఆర్నకొండ, రాగంపేట, బోయినిపల్లి మండలం తడగొండ, కొదురుపాకలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. వడ్లు ఏ గ్రేడ్‌కు రూ.2,060, బీ గ్రేడ్‌కు రూ.2,040 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. అంతకుముందు కోనేరుపల్లి వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే గంగాధర మండలం మధురానగర్‌లో రూ.2.33 కోట్లతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు రవిశంకర్శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ రవీందర్, సర్పంచులు లత, తులిశమ్మ, విద్యాసాగర్‌రెడ్డి, రవి, గంగాధర జడ్పీటీసీ అనూరాధ, కొండగట్టు ఆలయ డైరెక్టర్ నర్సయ్య, సర్పంచ్లావణ్య-, బోయినిపల్లి ఎంపీపీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
శాంతినగర్‌లో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, గంజాయి పట్టివేత
కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట శాంతినగర్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో14 జిలెటిన్ స్టిక్స్, 13 డిటోనేటర్లు, 2 కిలోల గంజాయి, 5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 500 లీటర్ల కల్తీ నూనె, పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీ కరుణాకర్‌రావు, ఇన్స్పెక్టర్లు విజ్ఞాన్‌రావు, రవీందర్, కొత్తపల్లి ఎస్సై ఎల్లయ్యగౌడ్ పాల్గొన్నారు.
జాతీయ ఫెడరేషన్ కప్ లో ‘అల్ఫోర్స్’కు పతకాలు
కరీంనగర్ టౌన్, వెలుగు: 4వ జాతీయ ఫెడరేషన్ కప్ పోటీలో అల్ఫోర్స్ గురుకుల విద్యాలయం స్టూడెంట్లు పతకాలు సాధించినట్లు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక రేకర్తిలోని అల్ఫోర్స్ స్కూల్ లో ఆయన మాట్లాడుతూ ఇటీవల మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో జరిగిన జాతీయ ఫెడరేషన్ కప్ పోటీలో అల్ఫోర్స్ అండర్ 17 స్టూడెంట్లు కబడ్డీ విభాగంలో మొదటి స్థానంతో పాటు బంగారు పతకం, ఖో-ఖోలో రజత పతకం, బ్యాట్మింటన్ లో కె.సుజిత్ రెడ్డి, అథ్లెటిక్స్ జావలిన్ త్రోలో పి.వశిష్ట రజత పతకం సాధించారన్నారు.
అభివృద్ధిలో అగ్రభాగాన కరీంనగర్ : కలెక్టర్ కర్ణన్
కరీంనగర్ సిటీ, వెలుగు: జిల్లాలో అమలు చేస్తున్న ప్రతి పథకం విజయవంతమై రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచిందని కలెక్టర్ కర్ణన్ తెలిపారు. సోమవారం విలేజ్ స్టడీ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాకు వచ్చిన 15 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ శిక్షణాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయనమాట్లాడారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, జిల్లాలో అడవులు తక్కువగా ఉన్నందున హరితహారం ద్వారా విరివిగా మొక్కలు పెంచుతున్నామన్నారు. దళితబంధు గురించి వివరించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, పీడీ శ్రీలతారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
మీడియాను ఎందుకు అనుమతించరు? కౌన్సిల్ సమావేశంలో బీజేపీ లీడర్ల నిరసన
వేములవాడ, వెలుగు: మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లకు మీడియాను ఎందుకు అనుమతించడంలేదని బీజేపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం వేములవాడ మున్సిపల్ ఆఫీస్‌లో చైర్ పర్సన్ మాధవి అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్జరిగింది. ఈ సందర్భంగా 20 ఎజెండా అంశాలను ఆమోదించారు. అంతకుముందు బీజేపీ కౌన్సిలర్లు ముప్పిండి సునంద, రేగుల సంతోష్, కృష్ణవేణి, ఉమారాణి, కవిత, లావణ్య మీడియాను సమావేశం లోపలికి అనుమతించాలని కమిషనర్ అన్వేశ్ కి వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ లో జరిగే కార్యక్రమాలు మీడియాకు తెలియనివ్వడంలేదని, ఇక నుంచి అనుమతించకపోతే సమావేశం బాయ్ కాట్ చేస్తామన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు విజయ్, మహేవ్, అజయ్తదితరులు పాల్గొన్నారు.
ఆరుగురు ఎస్‌ఐల బదిలీ
గోదావరిఖని, వెలుగు : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఆరుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నస్ఫూర్ స్టేషన్‌లో పనిచేస్తున్న టి.శ్రీనివాస్‌ను బసంత్ నగర్ స్టేషన్‌కు, బసంత్‌నగర్ ఎస్సై ఎ.మహేందర్‌ను పొత్కపల్లికి, పొత్కపల్లిలో పనిచేస్తున్న ఎస్.లక్ష్మన్‌ను రామగుండం ట్రాఫిక్ స్టేషన్‌కు, పెద్దపల్లి స్టేషన్ ఎస్సై రాజవర్ధన్‌ను కాల్వ శ్రీరాంపూర్, రామగుండం ట్రాఫిక్ ఎస్సై ఎం.కమలాకర్‌ను గోదావరిఖని టుటౌన్ స్టేషన్‌కు, సిరిపూర్ టౌన్‌లో పనిచేస్తున్న ఎం.రవికుమార్‌ను సీసీసీ నస్ఫూర్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఎన్టీపీసీలో వారోత్సవాలు ప్రారంభం
జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను సంస్థ సీజీఎం సునీల్ కుమార్ సోమవారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో మాట్లాడారు. సంస్థ ఉద్యోగులు ఉద్యోగంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వారోత్సవాలలో భాగంగా ఉద్యోగులకు వ్యాస రచన, ఉపన్యాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమలంలో ఎన్టీపీసీ ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ ఉద్యోగులు సీజీఎం సమక్షంలో సమగ్రతా ప్రతిజ్ఞ చేశారు.
‘వివేకానంద’లో జాతీయ సమైక్యత దినోత్సవం
కరీంనగర్ టౌన్, వెలుగు: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా పట్టణంలోని వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించినట్లు సోమవారం ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి శ్రీనివాస్ నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గోపీకృష్ణ, సతీశ్, బండి సంపత్ కుమార్, లెక్చరర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.