పెగడపల్లి, వెలుగు: అబద్ధాలు మాట్లాడడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కేరాఫ్ అడ్రస్‌గా మారారని బీజేపీ మండలాధ్యక్షుడు గంగుల కొమురెల్లి అన్నారు. ఆదివారం పెగడపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్న దృష్ట్యా పార్టీ ఎంత ప్యాకేజీ ఇచ్చిందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నిండం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి మారినప్పుడు టీఆర్ఎస్ ఎంత ప్యాకేజీ ఇచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లీడర్లు పి. నరేందర్, మోహన్ రెడ్డి, కె.బాబు, గంగాధర్, రాము, సతీశ్, అంజి, శ్రీనివాస్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
నాలుగేళ్లు గడిచినా రోడ్డు వేయరా?
జగిత్యాల, వెలుగు: స్థానిక రాజీవ్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరై నాలుగేళ్లు గడిచినా కాంట్రాక్టర్పనులు ప్రారంభించలేదని ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ బైపాస్ రోడ్డు కోసం 2018 జూన్ లో టీయూఎఫ్ఐడీసీ కింద రూ.2.56 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిన కాంట్రాక్టర్ నాలుగేళ్లుగా రోడ్డు వేయకపోతే అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై సమీక్షించాల్సిన మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లోనే కాలం గడుపుతూ ట్విట్టర్ మంత్రిగా పేరు పొందాడని ఎద్దేవా చేశారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు నాగభూషణం, ఎస్సీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం
కొడిమ్యాల, వెలుగు: కొన్ని కమ్యూనిటీల్లో 18 ఏళ్ల లోపు అమ్మాయిలకు పెళ్లి తప్పు కాదన్న సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారాం తండాలో నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్సత్యర్ధి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా ప్రోగ్రాంలో ఎమ్మెల్యే రవిశంకర్ తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బాల్యవివాహాలు అరికట్టడానికే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలను తెచ్చిందన్నారు. అనంతరం బాల్యవివాహాల నిర్మూలన పోస్టర్ ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేసి, క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వసంత, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
‘సర్దార్ సత్రం రక్షణకు సమష్టి పోరాటం’
జగిత్యాల, వెలుగు: సర్దార్ సత్రం ప్రజల ఆస్తి అని, అన్ని సంఘాల ఆధ్వర్యంలో సమష్టిగా పోరాటం చేద్దామని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఆదివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడారు. సర్దార్ సత్రాన్ని వైశ్య భవన్ గా పేరు మార్చడం వైశ్యులకు తగదన్నారు. సర్దార్ సత్రం గురించి నిజాలు తెలుసుకొని ప్రభుత్వం జగిత్యాల ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో మాల మహా నాడు జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం బాధ్యులు శంకర్, ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు నరసయ్య, మహేశ్ పాల్గొన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయరా?
కోనరావుపేట,వెలుగు : వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచిన రమేశ్‌బాబు ఇచ్చిన హామీలు అమలు చేయరా అని మండలంలోని మంగళపల్లి గ్రామస్తులు, లీడర్లు ప్రశ్నించారు. ఆదివారం మంగళపల్లి గ్రామంలోని మట్టి రోడ్డును బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్ రావు, మండలాధ్యక్షుడు గొట్టే రామచంద్రం గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రమేశ్ బాబు గ్రామానికి ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదన్నారు. మంగళపల్లికి తారు రోడ్డు వేసిన తర్వాతే గ్రామానికి వస్తానని శపథం చేసి మాట మరిచిన రమేశ్‌బాబుకు తమ గ్రామానికి వచ్చే అర్హత లేదన్నారు. గ్రామానికి చెందిన యువకులే సొంత ఖర్చులతో రోడ్డుపై తాత్కాలికంగా మట్టిపోసి చదును చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మండలాధ్యక్షుడు ఎనగంటి నాగార్జున, ఉప్పుల శ్రీకాంత్, ఊరడి మధు, సాసాల సురేశ్, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
వీణవంక, వెలుగు : మండలంలోని దేశాయ్ పల్లి గ్రామనికి చెందిన కాంపల్లి కొమరయ్య(58) ఇసుక ట్రాక్టరు ఢీకొని మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. కొమురయ్య ఆదివారం గ్రామం నుంచి తన పొలానికి వెళ్తుండగా పుదారి వసంత లిఫ్ట్ అడిగింది. వసంతను ఎక్కించుకుని బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్బైక్ను ఢీకొట్టింది. దీంతో కొమురయ్య ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయడాడు. స్థానికులు 108 వాహనంలో కొమురయ్యను జమ్మికుంట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బైక్వెనక కూర్చున్న వసంత పక్కకు పడి తీవ్రంగా గాయపడడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జమ్మికుంట రూరల్ సీఐ సురేశ్, ఎస్సై శేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ ను తీసివేస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ట్రాక్టర్ల వేగంతో వస్తుండటంతో ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహించిన గ్రామస్తులు కరీంనగర్, జమ్మికుంట రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కొమురయ్య కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఫామ్ ల్యాండ్‌పై పెట్టుబడితో లాభాలు
మంచిర్యాల, వెలుగు : ఫామ్ల్యాండ్పై పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని అంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ అన్నారు. మంచిర్యాల హాజీపూర్ మండలం ముల్కల్లలో 12 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ వెంచర్‌ను త్వరలో లాంచ్చేయనున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆదివారం మంచిర్యాల తిలక్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో రిలీజ్ చేశారు. ఫామ్ ల్యాండ్‌లో ఎర్రచందనం, శ్రీగంధం చెట్ల పెంపకం ద్వారా 15 ఏండ్లలోనే లక్షల్లో ఆదాయం వస్తుందన్నారు. తమ సంస్థపై నమ్మకం, కస్టమర్ల ఆదరణతో ఇప్పటివరకు వందల ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ వెంచర్లు ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్, ఆదిలాబాద్, నిర్మల్, గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా మార్కెటింగ్ ఏజెంట్లు, కస్టమర్లు పాల్గొన్నారు.
మహాసభలు విజయవంతం చేయండి
వీర్నపల్లి, వెలుగు : వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచలో జరిగే జిల్లా గ్రామ పంచాయతీల వర్కర్స్ యూనియన్ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ అనుబంధ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేశ్ పేర్కొన్నారు. ఆదివారం వీర్నపల్లిలో కార్మికులతో కలిసి సమస్యలు పరిష్కరించాలని వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దుచేసి నెలకు కనీసం రూ.21 వేల వేతనం ఇవ్వాలన్నారు. హెల్త్ కార్డులు అందజేసి, రూ.10 లక్షల బీమా కల్పిస్తూ, కారోబార్లను విలేజ్ అసిస్టెంట్ గా నియమించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు అరుణ్ కుమార్, నాయకులు నర్సయ్య, శేఖర్
పాల్గొన్నారు.