ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

రాజన్న సిరిసిల్ల,వెలుగు: సెస్ ఎన్నికల్లో సత్తా చాటుతామని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.  మంగళవారం సిరిసిల్ల పట్టణంలో సెస్ ఎన్నికలపై పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్​ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, సెస్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందన్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే ఎన్నికలకు వెళ్లాలంటే ఆ పార్టీ భయపడుతోందన్నారు. సిరిసిల్లలో 10 మంది షాడో ఎమ్యెల్యేలు ఉన్నారన్నారని, వారంతా ల్యాండ్, ఇసుక మాఫియా నడుపుతున్నారన్నారు. రిజర్వేషన్​ఖరారైన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని పొన్నం తెలిపారు. కాంగ్రెస్ ను సిరిసిల్ల ప్రజలు ఆదరించాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ నాగుల సత్యనారాయణ గౌడ్, పార్టీ వేములవాడ ఇన్​చార్జ్​ శ్రీనివాస్, లీడర్లు శ్రీనివాస్, వనిత, అన్ని మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తీగలగుట్టపల్లి వద్ద రైల్వేబ్రిడ్జి నిర్మించాలె

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ కు  వచ్చే ప్రధాన దారిలో ఉన్న తీగలగుట్టపల్లి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి నిర్మించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ డిమాండ్​చేశారు. మంగళవారం తీగలగుట్టపల్లి వద్ద గల రైల్వే ట్రాక్ వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. తన హయాంలోనే కరీంనగర్ నుంచి తిరుపతికి ట్రైన్​వేయించానని గుర్తు చేశారు. అనంతరం వచ్చిన ఎంపీలు వినోద్ కుమార్, బండి సంజయ్ కరీంనగర్​అభివృద్ధికి ఒక్క రూపాయి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సత్యప్రసన్నరెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 

మైనారిటీల అభివృద్ధికి కృషి చేయాలి : షహజాది

కరీంనగర్ టౌన్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేసే ప్రతి పథకం మైనారిటీలకు అందేలా చూడాలని  జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్  షహజాది అన్నారు.  మంగళవారం కలెక్టరేట్ లో మైనారిటీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా షహజాది మాట్లాడుతూ మైనారిటీ స్కూళ్లు, మదర్సాలలో చదివే పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. మసీదులు,  దర్గా, వక్ఫ్  భూములకు హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. 

జనవరి 7 నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు : మంత్రి గంగుల

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆరో బ్రహ్మోత్సవాలు జనవరి7 నుంచి మొదలవుతాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆవరణలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల కార్యాచరణ సమావేశంలో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ భక్తిభావం ఉట్టిపడేలా వైభవంగా  బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. 30న శ్రీవారి కళ్యాణం, ఫిబ్రవరి 2న వైభవోపేతంగా శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. 10వేల తిరుమల లడ్డూలు పంపిణీ చేస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. 

గొప్ప పుణ్యక్షేత్రంగా రేకుర్తి టెంపుల్​

రేకుర్తి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని గొప్ప పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి గంగుల అన్నారు. కోర్టు కేసులు పరిష్కారం కాగానే గుట్టపైకి వెళ్లే దారిని నిర్మించి, అద్భుత టూరిజం స్పాట్  గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రామ్ నగర్ లోని 10ఎకరాల స్థలంలో టీటీడీ  త్వరలో టెంపుల్ నిర్మాణ పనులను ప్రారంభించనుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ లీడర్ చల్ల హరిశంకర్, గ్రంథాలయ  చైర్మన్ పొన్నం అనిల్, మధు, ప్రసాద్ పాల్గొన్నారు.

మహిళపై అత్యాచారయత్నం చేసిన నిందితుడి అరెస్ట్

తంగళ్ళపల్లి, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్ శివారులోని గండ్ల పోచమ్మ గుట్టల్లో మహిళపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని సిరిసిల్ల పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 15న ఓబులాపూర్​గ్రామానికి చెందిన గంట తిరుపతి సిరిసిల్ల లేబర్ అడ్డా మీద ఓ మహిళను పని ఉందని బైక్​పై తీసుకెళ్లాడు. అనంతరం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వివస్త్రను చేసి నాలుగు గంటల పాటు హింసించి, అత్యాచారయత్నం చేశాడు.  అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారం తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్, ఎస్సై మహేందర్ తెలిపారు.

అనారోగ్యంతో తల్లి, గుండెపోటుతో తండ్రి మృతి.. అనాథలైన ఇద్దరు పిల్లలు

మల్లాపూర్, వెలుగు: బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి గుండెపోటుతో తండ్రి చనిపోగా.. ఆ దిగులుతో అనారోగ్యంతో మంచం పట్టిన తల్లి మంగళవారం చనిపోయింది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మల్లాపూర్​ మండలం వాల్గొండకు చెందిన గుంటి బర్నబా-– అమృత దంపతులకు అజయ్(13), హర్ష(11) ఇద్దరు కుమారులు. బర్నబా బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లగా కొన్ని నెలల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి దిగులుతో అమృత అనారోగ్యంతో మంచంపట్టింది. హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. తల్లి దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో పిల్లలిద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఈ విషయం సోషల్​మీడియాలో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న సీఎస్ఆర్ ఫౌండేషన్ , కొంతమంది దాతలు ముందుకు రావడంతో అమృత శవానికి గ్రామస్తులు అంతక్రియలు నిర్వహించారు. 

సింగరేణి కంపెనీ స్థాయి వాలీబాల్‌‌ పోటీలు

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆర్జీ 2 ఏరియాలోని ఏపీజే అబ్దుల్‌‌ కలాం స్టేడియంలో మంగళవారం కంపెనీ లెవల్‌‌ వాలీబాల్‌‌ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ఏరియా జనరల్‌‌ మేనేజర్‌‌ ఎ.మనోహర్‌‌ ప్రారంభించారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. జీఎం మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్​ఏరియా ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ఎస్వోటు జీఎం రవీందర్, అధికారుల సంఘం ఏరియా 
అధ్యక్షుడు జి.మోహన్ రెడ్డి, జి.రాజేంద్రప్రసాద్, ధనుంజయ పాల్గొన్నారు.

బద్దిపోచమ్మకు బోనాలు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోని శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు, మొక్కులు సమర్పించారు. అమ్మవారికి కల్లు సాక పోసి శాంతంగా ఉండాలని వేడుకున్నారు. ఉదయం నుంచే వందలాది మహిళలు నెత్తిన బోనాలతో గంటల తరబడి క్యూలెన్ లో ​ వేచి ఉండి మొక్కులు చెల్లించారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణలో భాగంగా కూల్చివేతలు కొనసాగుతుండగా భక్తులు ఇబ్బంది పడ్డారు. 

ఎమ్మెల్సీ దళితులకు క్షమాపణ చెప్పాలి

హుజూరాబాద్​ వెలుగు: ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డి దళితులకు క్షమాపణ చెప్పాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్​ చౌరస్తాలో ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడ్పీ చైర్​పర్సన్​ విజయ పట్ల కౌశిక్​రెడ్డి ప్రవర్తించిన తీరు బాధకరమన్నారు. తక్షణమే ఎమ్మెల్సీని టీఆర్ఎస్​నుంచి సస్పెండ్​ చేయాలన్నారు. కార్యక్రమంలో  నాయకులు రుద్రారపు రాంచంద్రం, సంపత్​ కుమార్​, సారయ్య, స్వామి, రాములు పాల్గొన్నారు.