కరీంనగర్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల నైతిక హక్కులను కాలరాస్తూ పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తోందని నియోజకవర్గ కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు అన్నారు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో నిర్వహించిన ఏఐటీయూసీ మహాసభల సందర్భంగా శనివారం గీత భవన్ చౌరస్తా నుంచి రెవెన్యూ గార్డెన్ వరకు కార్మికులతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన రోహిత్ రావు మాట్లాడుతూ కార్మికలోకానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని అన్నారు. 1920లో ఆవిర్భావించిన ఏఐటీయూసీ ఎన్నో ఉద్యమాలు చేసి కార్మికులకు అండగా నిలిచిందన్నారు. సకల జనుల సమ్మెలో కార్మికుల పాత్ర ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుచ్చన్న, టేకుమల సమ్మయ్య పాల్గొన్నారు.
సింగరేణిని సందర్శించిన విదేశీ బృందం
గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్ పరిధి ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్ట్‌ను 26 మంది సభ్యులతో కూడిన విదేశీ ప్రతినిధి బృందం శనివారం సందర్శించింది. విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఈపీటీఆర్‌ఐ)లో పర్యావరణంపై ఓపెన్ కాస్ట్‌ల ప్రభావం అనే అంశంపై మూడు వారాల శిక్షణ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా విదేశీ ప్రతినిధులు ఓసీపీ 3 ప్రాజెక్ట్‌ను సందర్శించారు. సింగరేణి మేనేజ్‌మెంట్ అమలు చేస్తున్న చర్యలను ప్రాజెక్ట్ ఆఫీసర్ జి.మోహన్ రెడ్డి వారికి వివరించారు. వారివెంట ఓసీపీ 3 మేనేజర్ రమేశ్ తదితరులు ఉన్నారు.
మహిళలకు చీరల పంపిణీ
గోదావరిఖని, వెలుగు : మిలాద్‌ఉన్ నబీ సందర్భంగా ఐఎన్‌టీయూసీ సెంట్రల్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.నర్సింహరెడ్డి శనివారం స్థానిక గాంధీనగర్‌లోని నురానీ మసీదు వద్ద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. యూనియన్ లీడర్ అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవలపల్లి రాజేందర్, పోల్సాని గంగాధర్, మసీద్ సదర్ గయాజ్ అలీబేగ్, అలీ పాషా, ఎండీ సాహెబ్ అలీ, ఎస్.కె బాబుమియా, బర్ల మనోహర్ పాల్గొన్నారు.
సింగరేణిని సందర్శించిన విదేశీ బృందం
గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్ పరిధి ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్ట్‌ను 26 మంది సభ్యులతో కూడిన విదేశీ ప్రతినిధి బృందం శనివారం సందర్శించింది. విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఈపీటీఆర్‌ఐ)లో పర్యావరణంపై ఓపెన్ కాస్ట్‌ల ప్రభావం అనే అంశంపై మూడు వారాల శిక్షణ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా విదేశీ ప్రతినిధులు ఓసీపీ 3 ప్రాజెక్ట్‌ను సందర్శించారు. సింగరేణి మేనేజ్‌మెంట్ అమలు చేస్తున్న చర్యలను ప్రాజెక్ట్ ఆఫీసర్ జి.మోహన్ రెడ్డి వారికి వివరించారు. వారివెంట ఓసీపీ 3 మేనేజర్ రమేశ్ తదితరులు ఉన్నారు.
ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్
సుల్తానాబాద్, వెలుగు: రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ ను ఎంచుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సంగీత కోరారు. సుల్తానాబాద్ మండలం రెబ్బలుదేవ్ పల్లిలో శనివారం ఆయిల్ పామ్ నర్సరీని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ జిల్లాలో 9,069 ఎకరాల్లో 5లక్షల 16 వేల ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేయాలన్నారు. పంటను మూడేళ్లు కాపాడుకుంటే 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ముత్తారం మండలానికి చెందిన కళ్యాణపు రాజమల్లు అనే రైతును కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, డీఏఓ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికబద్ధంగా ఓటరు నమోదు
పెద్దపల్లి: ఓటరు నమోదును ప్రణాళికబద్ధంగా జరపాలని కలెక్టర్ డాక్టర్ సంగీత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తాజా మార్పులతో యువత జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండినట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటర్ జాబితా మూడు నెలలకు ఒకసారి అప్ డేట్ అవుతుందన్నారు.
జడ్పీహెచ్ఎస్ టీచర్ సస్పెన్షన్
వేములవాడ రూరల్, వెలుగు : పిల్లలకు చదువు చెప్పకుండా హెడ్మాస్టర్ను దుర్భాషలాడిన టీచర్ సస్పెండ్ అయ్యారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి జడ్పీ హెచ్ఎస్ లో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జె.శివప్రసాద్ స్టూడెంట్లకు సక్రమంగా చదువు చెప్పడం లేదు. హెడ్మాస్టర్ కె.నీరజ పలుసార్లు టీచర్‌ను మందలించినా అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో నీరజను దుర్భాషలాడడంతో ఆమె పోలీసులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ బన్సీలాల్, ఎస్ఐ నాగరా జు స్కూల్లో, గ్రామంలో విచారణ చేపట్టి టీచర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం డీఈఓ రాధాకిషన్ శివప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
భవిష్యత్ తరాలకు నీటిని అందించాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: జల సంపదను పొదుపుగా వాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ షోయబ్ అహ్మద్ కలాల్ అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్ కర్ణన్, భూగర్భ జల శాఖ, అటవీ శాఖ, డీఆర్డీఏ, నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటి నిల్వలు తగ్గితే భవిష్యత్తు తరాలు తీవ్ర ఇబ్బందులు పడతాయన్నారు. బెంగుళూరు తదితర నగారాలలో ఉన్న అభివృద్ధితో కరీంనగర్ జిల్లా ఉత్తర భారత దేశంలో ప్రథమంగా నిలిచిందన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, డీఆర్డీఓ శ్రీలతారెడ్డి, డీఎఫ్ఓ బాలామణి పాల్గొన్నారు.
కార్పొరేటర్‌కు ఇల్లు కూల్చే అధికారం ఎక్కడిది?
కరీంనగర్, వెలుగు: సామాన్యుల ఇండ్లు కూల్చే అధికారం కార్పొరేటర్ జంగిలి సాగర్ కు ఎవరిచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మండిపడ్డారు. కరీంనగర్‌లో భూ కబ్జాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అక్రమాలకు అడ్రస్ గా మారిందన్నారు. ఇల్లు కట్టుకోవాలంటే కార్పొరేటర్ అనుమతి కూడా తీసుకోవాలా? అని ప్రశ్నించారు. గతంలో మల్కాపూర్ లో ఇంటి నిర్మాణాన్ని కూల్చిన ఘటన మరవకముందే సీతారాంపూర్ కార్పొరేటర్ జంగిలి సాగర్ నిర్మాణంలో ఉన్న ఇంటిని జేసీబీతో కూల్చడం దారుణం అన్నారు. ఈ దౌర్జన్యాలపై మంత్రి గంగుల కమలాకర్ మౌనం వహించడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ధర్నాలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శులు, లీడర్లు పాల్గొన్నారు.
ప్రైమరీ స్కూల్లో డీఈఓ తనిఖీ
కోనరావుపేట, వెలుగు : మండలంలోని ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డీఈఓ రాధాకిషన్ శనివారం తనిఖీ చేశారు. క్లాస్ రూంలో కూర్చుని టీచర్విద్యార్థులకు బోధిస్తున్న తీరును పరిశీలించారు. స్టూడెంట్లకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈఓ రఘుపతి, హెడ్మాస్టర్ పద్మజ ఉన్నారు.
భర్తను చంపిన భార్య అరెస్టు
జ్యోతినగర్, వెలుగు: ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో భర్తను చంపిన భార్యను అరెస్ట్ చేసినట్లు శనివారం పెద్దపల్లి డీసీపీ రూపేశ్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని సర్వెంట్ క్వార్టర్ లో చిలుముల సుమన్, స్పందన నివాసముండేవారు. సుమన్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిసైన సుమన్ ఆటో ఫైనాన్స్ చెల్లించలేక డబ్బు కావాలని భార్యను నిత్యం వేధించేవాడు. స్పందన ఇండ్లలో పని చేసి కుటుంబాన్ని పోషించేది. తన సోదరుడికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో అతడికి తన బంగారు గొలుసు ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సుమన్ తరుచూ స్పందనతో గొడవపడేవాడు. శుక్రవారం కూడా బాగా గొడవ జరగడంతో ఆగ్రహించిన స్పందన సిమెంట్ ఇటుకతో భర్త తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై సుమన్ అక్కడికక్కడే చనిపోయాడు. సమావేశంలో రామగుండం సీఐ కణతాల లక్ష్మీనారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు.
స్కూళ్లలో ముందస్తు దీపావళి
కరీంనగర్ జిల్లాలోని అల్ఫోర్స్, సిద్ధార్థ, భగవతి, మానేర్ హై స్కూళ్లలో శనివారం ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్స్ సంప్రదాయ దుస్తులు ధరించి లక్ష్మీపూజ చేశారు. అనంతరం బాణాసంచా కాల్చారు. కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, భగవతి స్కూల్ ప్రిన్సిపల్ కళావతి, సిద్ధార్థ అకడమిక్ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి, మానేర్ స్కూల్ చైర్మన్ కడారు అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. - వెలుగు, కరీంనగర్