ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పెద్దపల్లి, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారంటూ బీజేపీని విమర్శిస్తూ టైం వేస్టు చేసుకోవద్దని, పెద్దపల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్​పర్సన్ మమతారెడ్డి దృష్టి  సారించాలని బీజేపీ సీనియర్ లీడర్ జి. సురేశ్​రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని, పార్టీని విమర్శించే స్థాయి వాళ్లకు లేదన్నారు. కేసీఆర్ వేసిన ప్లాన్ తిరగబడిందన్నారు. నాయకులు ఠాకూర్​క్రాంతి, రాజవీర్, శ్రీధర్, మనోహర్ 
తదితరులున్నారు. 

బల్దియా కార్మికుల కోసం హెల్త్​ క్యాంప్​

కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: ప్రజలతో పాటు నగరపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగుల హెల్త్​ను కాపాడుకోవడం బల్దియా బాధ్యత అని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులు అనారోగ్యానికి గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి కోసం హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశామని వెల్లడించారు. 

రేషన్​ కార్డు లేదని దళితబంధు ఇవ్వట్లే

హుజూరాబాద్​ వెలుగు: రేషన్ కార్డులు లేవనే నెపంతో దళితబంధు అమలు చేయటంలేదని హుజూరాబాద్​ నియోజయవర్గం దళితబంధు సమన్వయ కమిటీ లీడర్లు శుక్రవారం ఆర్డీఓ ఆఫీస్​ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవటంతో చాలామంది లబ్ధిదారులు మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. కొందరికి రేషన్ కార్డులు ఉండి, బ్యాంకులో డబ్బులు జమ అయినా పథకం అందిచడంతో అధికారులు కొర్రీలు పెడుతున్నారన్నారు.అధికారులు వెంటనే స్పందించాలని లేకపోతే పాదయాత్ర ద్వారా నిరసన చేస్తామని హెచ్చరించారు. అనంతరం దళిత బంధు ప్రత్యేక అధికారి జగత్ సింగ్​కు వినతి పత్రం అందజేశారు. 

బీజేపీని బద్నాం చేయడానికి కుట్రలు

మెట్ పల్లి, వెలుగు: బీజేపీని బద్నాం చేయడానికి సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బీజేపీ, బీజేవైఎం లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెట్ పల్లిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మోడీ సర్కారు నిజాయితీతో సుస్థిర పాలన అందిస్తోందన్నారు. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం కావడంతో భయపడిన టీఆర్ఎస్​ఎమ్మెల్యేల అక్రమ కొనుగోళ్ల విషయాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. టీఆర్ఎస్ కు చెందిన కొందరు వ్యక్తులను తీసుకొచ్చి ఢిల్లీ నుంచి వచ్చారని క్రియేట్ చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ: ఎమ్మెల్యే ల కొనుగోలు విషయాన్ని తెరపైకి తెచ్చి బీజేపీపై బురదజల్లేందుకు టీఆర్ఎస్​ప్రయత్నిస్తోందని బీజేపీ లీడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం వేములవాడలో కేసీఆర్​దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం వేసిన ప్లాన్​ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు సంతోష్ బాబు, మండలాధ్యక్షుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.  

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

కరీంనగర్ సిటీ, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి డిమాండ్​చేశారు. కరీంనగర్ లోని సీపీఐ ఆఫీస్​లో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత స్వార్థంతోనే మునుగొడులో ఉప ఎన్నిక జరుగుతోందన్నారు. బీజేపీ ఓడించేందుకే టీఆర్ఎస్ కు వామపక్ష పార్టీలు మద్దతిస్తున్నాయన్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన పార్టీ మహాసభలలో వామపక్షాల పునరేకీకరణపై చర్చించినట్లు చెప్పారు. 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో కుట్ర పూరితంగా వ్యవహరించి ఆయనను  విడుదలను అడ్డుకున్నారన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.  

‘పట్టణ అభివృద్ధే లక్ష్యం’

జగిత్యాల, వెలుగు: పట్టణాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని బల్దియా చైర్​పర్సన్ భోగ శ్రావణి అన్నారు. జిల్లా కేంద్రంలోని బల్దియా ఆఫీస్ లో శుక్రవారం నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. కౌన్సిలర్లు తమ వార్డు ల్లోని ఆస్తి పన్ను బకాయి ఉన్నవారికి అవగాహన కల్పించాలన్నారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీం కింద వడ్డీపై 90 శాతం మాఫీ ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎజెండాలో పొందుపరిచిన 2 ఆంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో వైస్ చెర్మన్ శ్రీనివాస్, కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు  పాల్గొన్నారు

డీ విటమిన్ కోసం.. ఎండ సొడలో చిన్నారులు

పుట్టిన బిడ్డలకు డీ విటమిన్ లోపిస్తే కామెర్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే చిన్నారులకు సరిపడినంత సూర్యరశ్మి అవసరం. ఉదయం, సాయంత్రం సూర్య కిరణాలు పిల్లల శరీరంపై పడితే సరిపడినంత డీ విటమిన్ ​అందుతుందని డాక్టర్లు చెబుతున్నారు. శుక్రవారం కరీంనగర్ మాతా,శిశు సంక్షేమ హాస్పిటల్ ఆవరణలో పిల్లలకు సూర్య కిరణాలు తగిలేలా తల్లులు, బంధువులు ఒళ్లో పెట్టుకుని కూర్చున్నారు. 

బద్ధిపోచమ్మ ఆలయ పరిసరాల్లో కూల్చివేతలు

వేములవాడ, వెలుగు: స్థానిక బుద్ధిపోచమ్మ ఆలయ విస్తరణ నేపథ్యంలో దేవస్థానం చుట్టూ ఉన్న ఇళ్లను శుక్రవారం అధికారులు కూల్చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పవన్​కుమార్, అర్బన్ తహసీల్దార్ రాజిరెడ్డి మాట్లాడుతూ ఆలయ విస్తరణకు ప్రభుత్వం 39 గుంటల భూమి సేకరించిందన్నారు. ఇళ్ల యాజమానులకు రూ.17.50 కోట్ల పరిహారం అందజేశామన్నారు. పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించడంతో ఇళ్లు, దుకాణాలను ప్రజలు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారని తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన ఇండ్లను కూల్చేస్తామని పేర్కొన్నారు. వారి వెంట రెవెన్యూ సిబ్బంది, వీటీడీఏ అధికారి సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

సుందర నగరంగా రామగుండం

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ ను సుందరనగరంగా మార్చుకుందామని మేయర్ అనిల్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థ మీటింగ్ హాల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  గోదావరిఖని ప్రధాన చౌరస్తా లో కూడలి అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, రాజేశ్​థియేటర్ వద్ద పనులు జరుగుతున్నాయని అన్నారు. సమావేశంలో  డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు, కమిషనర్ సుమన్ రావు  పాల్గొన్నారు.

విచారణ చేసి దోషులను గుర్తించండి

జగిత్యాల, వెలుగు: భూముల సాగు విషయంలో తమపై కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్​ఆఫీసర్లు భయపెడుతున్నారని, పూర్తి విచారణ చేసిన తర్వాతే దోషులను గుర్తించాలని రాయికల్ మండలం చింతలూర్ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం రాయికల్ ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయ లోపంతో సమస్యలు వస్తున్నాయన్నారు. 85, 97 సర్వే నంబర్లపై ఉన్న భూమిలో సర్వే చేసి వ్యవసాయ భూములను గుర్తించాలని డిమాండ్ చేశారు. 1988– -89 లో ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిలో సాగు చేస్తే ఫారెస్ట్ ఆఫీసర్లు కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. శుక్రవారం తమ గ్రామస్తులు సుమారు 50 మందిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేస్తామని ఆఫీసర్లు చెప్పడంతో ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేశామని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.