ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జమ్మికుంట, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని మండల పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్​ ఆఫీస్ ​ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు కొప్పల శంకర్ మాట్లాడుతూ స్థానిక అడ్డా కూలీలకు పనులు కల్పించాలని, భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక అడ్డా కేటాయించాలని, అడ్డా మీద కార్మికుల కోసం టాయిలెట్, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు కార్మికులు వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో మండల కార్యదర్శి రాజకుమారి, దాసరపు నర్సయ్య, లింగయ్య, లక్ష్మి, రవి తదితరులు పాల్గొన్నారు. 

సేఫ్టీలో ఫస్ట్‌‌.. జీడీకే 11 మైన్‌‌

గోదావరిఖని, వెలుగు: సింగరేణి 52వ రక్షణ వారోత్సవాలలో భాగంగా హాలేజ్‌‌ సేఫ్టీ విభాగంలో నిర్వహించిన పోటీలలో రామగుండం ఏరియా 1 పరిధిలోని జీడీకే 11వ మైన్‌‌కు ఫస్ట్‌‌ ప్రైజ్‌‌ లభించింది. శనివారం గని ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రక్షణ కమిటీ కన్వీనర్, క్వాలిటీ విభాగం జీఎం అల్లి రాజేశ్వర్, కార్పొరేట్‌‌ సేప్టీ జీఎం గురవయ్య బహుమతిని జీడీకే 11వ గని ఏజంట్‌‌ చిలుక శ్రీనివాస్‌‌, మేనేజర్‌‌ నెహ్రూకు అందజేశారు. కార్యక్రమంలో గ్రూప్ ఇంజనీర్​రాందాస్‌‌, ఫిట్ సెక్రటరీ శంకర్, ప్రొడక్షన్ మేనేజర్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
 

దళితులపై కేసీఆర్ ది కపట ప్రేమ

కొత్తపల్లి, వెలుగు: దళితుల ఓట్ల కోసం సీఎం కేసీఆర్ వారిపై కపట ప్రేమ చూపుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లిలో శనివారం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగాడి మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ తూట్లు పొడుస్తున్నారని, రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరామకృష్ణ, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్​రావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బాల్​రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి స్వామి తదితరులు పాల్గొన్నారు. 

నూలు సబ్సిడీ రిలీజ్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: బతుకమ్మ చీరలకు సంబంధించిన నూలు సబ్సీడీని ప్రభుత్వం విడుదల చేసిందని స్టేట్ పవర్‌ ‌లూమ్స్,టెక్స్ టైల్స్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ శనివారం తెలిపారు. ప్రభుత్వం మరమగ్గాల కార్మికులకు బతుకమ్మ చీరల కూలి సర్దుబాటు కోసం 10 శాతం నూలు రాయితీని ప్రకటించింది. 2019కు సంబంధించిన సబ్సిడీ 710.23 లక్షలను ప్రభుత్వం రిలీజ్ చేసిందని రెండు రోజుల్లో డబ్బు కార్మికుల ఖాతాల్లో జమ అవుతుందని ప్రవీణ్ తెలిపారు. ఈ సబ్సిడీతో సిరిసిల్లలో 4,181 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుంది.

‘ముదిరాజ్​ల జీవనంపై అధ్యయనం చేయాలి’

గంభీరావుపేట వెలుగు: ముదిరాజుల జీవన స్థితిగతులపై బీసీ కమిషన్ అధ్యాయం చేసి నివేదిక ఇవ్వాలని, అప్పుడే విద్య, వైద్యంలో వారికి న్యాయం జరుగుతుందని ముదిరాజ్ సంఘం లీడర్​పర్శ హన్మాండ్లు అన్నారు. గంభీరావుపేట మండలం ముస్తఫ్ నగర్ లో శనివారం నిర్వహించిన ముదిరాజ్ గర్జన సభలో ఆయన మాట్లాడారు.  రాష్ట్ర జనాభాలో 14 శాతంతో 50 లక్షలు మంది ముదిరాజులు ఉన్నారని, కాని చట్టసభల్లో మాత్రం ఒక్క శాతం కూడా లేరని అన్నారు. రాజకీయ పార్టీలన్నీ 17 ఎమ్మెల్యే, 2 ఎంపీ టికెట్లను ముదిరాజులకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు అంతయ్య, నాయకులు సత్తయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్ల ముసుగులో ప్రజాధనం వృథా

వేములవాడ, వెలుగు : మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు, లీడర్లు బినామీ కాంట్రాక్టర్ల ముసుగులో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. శనివారం వేములవాడలో పూర్తికాని గుడి చెరువు కట్టను ఆయన పరిశీలించారు. రూ.18 లక్షలు వెచ్చించారన్నారు. ఇంకా నిర్మాణం పూర్తికాని చెరువు కట్టకు పెయింటింగ్ వేయించారని, నాణ్యతా లోపంతో వర్షాలకు పెయింటింగ్ కొట్టుకుపోయిందని అన్నారు. ఆయన వెంట బీజేపీ పట్టణాధ్యక్షుడు సంతోష్ బాబు, ఎంపీపీ మల్లేశం యాదవ్, నాయకులు పాల్గొన్నారు.  

భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

మెట్ పల్లి, వెలుగు : ఫారెస్ట్, సర్కారు భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్ పల్లి ఆర్డీఓ వినోద్ కుమార్ అన్నారు. శనివారం మెట్ పల్లి మండలం రంగారావుపేట శివారులో ఫారెస్ట్ భూమిని చదును చేసి కొందరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శౌకత్ అలీ, ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఆఫీసర్లకు, గిరిజనులకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ గతంలో చాలామంది ఫారెస్ట్ భూములను కబ్జా చేసి వ్యవసాయం చేసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోలేని ఆఫీసర్లు తమపై ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. వ్యవసాయం చేసుకుందుకు భూమి లేని పేదలు భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. 

గురుకుల పీడీ సుష్మకు క్రీడారత్న అవార్డ్​

తిమ్మాపూర్, వెలుగు : క్రీడారత్న నేషనల్ అవార్డు–2022కు ఫిజికల్ డైరెక్టర్ బైరం సుష్మ ఎంపికైనట్లు స్కూల్​ప్రిన్సిపల్ దేవేంద ర్ రెడ్డి శనివారం తెలిపారు. సుష్మ అలుగునూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా ల, కాలేజీ, మల్లాపూర్, సుభాష్ నగర్, చింతకుంట, గర్రెపల్లి, ఆదిలాబాద్, భోద్ లలో వ్యాయామ టీచర్​గా పని చేశారన్నారు. సెలెక్షన్ కమిటీ చైర్మన్ నల్లా రాధాకృష్ణ సుష్మకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారని తెలిపారు. నవంబర్ 13న ఢిల్లీలో సుష్మ నేషనల్ అవార్డు అందుకుంటుందని తెలిపారు. 

దీపావళిలోపు బాధితులకు న్యాయం

గోదావరిఖని, వెలుగు : ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో ఉద్యోగాల కోసం డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులకు దీపావళి లోపు దళారుల నుంచి కొంత అమౌంట్‌‌ ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అఖిలపక్ష కమిటీ లీడర్లు తెలిపారు. శనివారం గోదావరిఖనిలో లీడర్లు కుమారస్వామి, వై.యాకయ్య, కె.రాజన్న, వేల్పుల కుమారస్వామి, ఇ.నరేశ్‌‌ మాట్లాడారు. దళారులైన మోహన్‌‌గౌడ్, గుండు రాజుతో చర్చించామని, వారు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ప్లాంట్‌‌లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలన్నారు.

‘అల్ఫోర్స్’లో ప్రపంచ ఆహార దినోత్సవం

కరీంనగర్‍ టౌన్, వెలుగు: ప్రపంచ ఆహార దినోత్సవాన్ని శనివారం అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ డాక్టర్​వనజతో కలిసి చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, టీచర్స్, స్కూడెంట్లు పాల్గొన్నారు . 

రోడ్లను ఎప్పుడు రిపేర్​ చేస్తరు?

పెద్దపల్లి, వెలుగు: ఇసుక లారీలతో ధ్వంసమైన రోడ్లను ఎప్పుడు మరమ్మతులు చేస్తారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడారు. ధ్వంసమైన రోడ్లను మరమ్మతు చేయడానికి 6 నెల క్రితమే నిధులు మంజూరైనాయనిఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి అన్నారని, ఇప్పటి వరకు పనులు ఎందుకు స్టార్ట్​ కాలేదన్నారు. పనులు చేపట్టకపోతే కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు ప్రేంసాగర్ రెడ్డి, నాయకులు రమేశ్, రవీందర్ రెడ్డి, శారదసంపత్ తదితరులు పాల్గొన్నారు. 

భార్య, పిల్లలు వదిలి వెళ్లారని వ్యక్తి ఆత్మహత్య

కోరుట్ల,వెలుగు: భార్య, పిల్లలు దూరంగా ఉంటున్నారని మానసికంగా కుంగిపోయి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోరుట్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణ పరిధి ఏకిన్ పూర్ కు చెందిన శ్రీ రాముల జితేందర్ కు(46) భార్య, ఇద్దరు కొడుకులున్నారు. భార్యా భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి దాదాపు10 ఏళ్ల క్రితం భార్య, పిల్లలను  కరీంనగర్ కు వెళ్లి అక్కడే ఉంటున్నారు. జితేందర్  పశువుల కాపరిగా పని చేస్తూ ఒంటరిగా జీవిస్తున్నాడు. కాగా మానసికంగా కుంగిపోయిన జితేందర్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతుడి తల్లి నర్సు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి

కరీంనగర్‍ సిటీ, వెలుగు: జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పత్తి కొనుగోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని  అడిషనల్​కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‍లో జిల్లాలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ద్వారా పత్తికొనుగోలు ముందస్తు చర్యలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కల్పించాలన్నారు. జిల్లాలోని 7 వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని అన్ని పత్తికొనుగోలు సెంటర్లలో పత్తి అమ్ముకోవాలని రైతులకు సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాశ్,  జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, ఎస్ఈ ఎలక్ట్రిసిటీ గంగాధర్, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.

కరీంనగర్ లో కళాకారులకు కొదువ లేదు

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ జిల్లాలో కళాకారులకు కొదువ లేదని, షార్ట్ ఫిల్మ్ లు, యూట్యూబ్ ల ద్వారా చాలా మంది ప్రతిభ వెలుగులోకి వస్తోందని టౌన్ ఏసీపీ తులా శ్రీనివాస్ రావు అన్నారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ బంకిట్ హాల్​లో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సీవీఎం హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన హెల్త్ క్యాంప్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాకారుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  నాయకులను, హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న సీవీఎం హాస్పిటల్ అధినేత డాక్టర్ చాట్ల శ్రీధర్ ను అభినందించారు. సీవీఎం ఆస్పత్రి అధినేత చాట్ల శ్రీధర్ మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాకారులకు తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ హెల్త్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చొప్పరి సుధాకర్, ప్రధాన కార్యదర్శి సీతామాలక్ష్మి, జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి నరేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

ఆల్‌‌ ఇండియా మైన్స్‌‌ పోటీలకు సింగరేణి టీమ్స్‌‌

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆర్జీ 2 డివిజన్‌‌లోని మైన్స్‌‌ రెస్క్యూ స్టేషన్‌‌లో నిర్వహించిన జోనల్‌‌ స్థాయి రెస్క్యూ పోటీలో ప్రతిభ కనబరిచిన 16 మంది సింగరేణి బ్రిగేడియర్ల ‌టీమ్​ను ఆల్‌‌ ఇండియా పోటీలకు మేనేజ్‌‌మెంట్‌‌ ఎంపిక చేసింది. రాజస్థాన్‌‌లోని ధరిబా మెటల్‌‌ మైన్స్‌‌లో నవంబర్‌‌ 14 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీలలో పాల్గొనే సింగరేణి ఏ ‒ జట్టులో కెప్టెన్‌‌గా అడ్రియాల ప్రాజెక్ట్‌‌ ఏరియా (ఏపిఏ) మైన్‌‌ సీనియర్‌‌ అండర్‌‌ కె.అనిల్‌‌ కుమార్‌‌, సభ్యులుగా ఎం.మురళీ కృష్ణ, బి.సత్యనారాయణ, బి.శ్రావణ్‌‌కుమార్‌‌, పి.శ్రీరామ్‌‌, డి.ప్రశాంత్‌‌, పి.ప్రకాశ్‌‌, టి.తేజ ఉన్నారు. సింగరేణి బీ‒ జట్టుకు కెప్టెన్‌‌గా కొత్తగూడెం ఏరియా మైనింగ్‌‌ సర్దార్ వి.శ్యామ్యూల్‌‌ ప్రతాప్‌‌, సభ్యులుగా బి.సాంబశివుడు, గుంటి మహేష్, ఎం.క్రాంతి కుమార్, ఆర్.ప్రసన్నకుమార్, ఎన్.సందీప్, ఎస్‌‌కె ముదాసిర్, కె.పూర్ణచందర్ వ్యవహరిస్తారు. వీరిని రెస్క్యూ విభాగం జనరల్‌‌ మేనేజర్‌‌ ఎస్.వెంకటేశ్వర్లు  తదితరులు అభినందించారు. గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమంలో బ్రిగేడియర్లను ఆర్జీ 1 ఏరియా జనరల్‌‌ మేనేజర్‌‌ కె.నారాయణ తదితరులు అభినందించారు.

ఆర్నెల్లకోసారి హిమోగ్లోబిన్ టెస్టు చేయాలి

తిమ్మాపూర్, వెలుగు : పిల్లల్లో హిమోగ్లోబిన్ శాతం 12 కన్నా అధికంగా ఉండేలా చూసుకోవాలని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్ తల్లిదండ్రులను కోరారు. మండలంలోని జ్యోతీబా పూలే గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీలో నిర్వహించిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 6 నెలలకు ఒకసారి హిమోగ్లోబిన్ పరీక్ష చేయించాలని అన్నారు. రోజూ కూరగాయలు, కోడిగుడ్లు, పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో  యూనిసెఫ్ కోఆర్డినేటర్ వెంకటేశ్, అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. 

ఉత్తమ ఉద్యోగులకు సన్మానం

కరీంనగర్ సిటీ, వెలుగు: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శనివారం నగరంలో ప్రజాప్రయోజనాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ అమీర్ ఆధ్వర్యంలో ఎన్​పీడీసీఎల్ టౌన్ -వన్ ఏఈ వెంకటరమణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్ ను సన్మానించారు. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కలాంను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కిమ్ ఫహద్, మొహమ్మద్ జమాల్, తేలు నాగరాజు, మహమ్మద్ షాబుద్దీన్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.