25 మందికి వంద ఓట్లైనా రాలే!

25 మందికి వంద ఓట్లైనా రాలే!
  •  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపని అభ్యర్థులు
  • వెయ్యి లోపు ఓట్లకే పరిమితమైన మరో 50 మంది క్యాండిడేట్లు 
  • రెండు చోట్ల టీచర్, గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీగా పోటీ చేసిన అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు  
  • కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో ప్రచారం చేసుకున్నా వచ్చినవి కేవలం 2,253 ఓట్లే

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 56 మంది పోటీ చేస్తే..25 మందికి ఫస్ట్ ప్రయార్టీ, సెకండ్ ప్రయార్టీ ఓట్లను కలిపినా వంద ఓట్లు కూడా పడలేదు. ఇందులో చాలా మందికి 50 ఓట్లలోపే వచ్చాయి. మూడు జాతీయ పార్టీల(బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ) అభ్యర్థులు మినహా రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.  ఇండిపెండెంట్ అభ్యర్థి చెలిక చంద్రశేఖర్ కు అందరి కంటే తక్కువగా 15 ఓట్లు పొందారు. ఆయన కరీంనర్ టీచర్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయగా 6  ఓట్లు, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా బరిలో నిలిచినా కేవలం ఒకే ఒక్క ఓటు రావడం గమనార్హం.

అదేవిధంగా మరి కొందరు అభ్యర్థులైన గుయ్య సాయికృష్ణ మూర్తి(18), బాలాజీ బకావడ్ (18), డాక్టర్ నిమ్మతోట వెంకటేశ్వర్లు(20), తీటి సుధాకర్ రావు (21), వేముల విక్రమ్ రెడ్డి(24), అక్కెపల్లి కరుణాకర్ (26), కొమ్ముల నగేశ్(27), కర్రా జగన్ (28), బండి శ్రీనివాస్ (30), పులగం దేవిదాస్ (33), కస్బా శంకర్ రావు (36), మల్లేశ్​ యాసర్ల (40), ఎన్.శ్రీనివాస్ (40), శనిగరం రమేశ్​బాబు(41), దయ్యాల ప్రసాద్ (43), పిడిశెట్టి రాజు(43), బొల్లి సుభాశ్(44), మచ్చ శ్రీనివాస్ (48), రవీందర్ నాయక్ రాథోడ్ (51), సిలివేరు శ్రీకాంత్ (79), అబ్బగోని అశోక్ గౌడ్ (80), దొడ్ల వెంకట్ (88), చందా సాయి కుమార్ (98), ఆంగ సంపత్ యాదవ్ (99) ఓట్ల చొప్పున వచ్చాయి. 

50 మందికి వచ్చిన ఓట్లు 8,301 

వందలోపు ఓట్లు 25 మందికి వస్తే, మరో 25 మందికి 100 నుంచి వెయ్యిలోపు ఓట్లు వచ్చాయి. సంకినేని మధుసూదన్ రావు (799), బక్కా జడ్సన్ (747), మందా జ్యోతి(733), ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి(608), బండారి రాజ్ కుమార్ (532), నరేందర్ రెడ్డి (451),  దేవునూరి రవీందర్ (322), దూడ మహిపాల్ (303), మెతుకు హేమలత పటేల్ (246), అవినాశ్​జాదవ్ (227), గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్ (222), డాక్టర్ రాజా సుమన్ రావు (185), కొమ్మిరెడ్డి మహేశ్​(182), సిలివేరి ఇంద్రా గౌడ్ (175), లంటు  చంద్రశేఖర్ (170), గవ్వల శ్రీకాంత్ (169), మేకల అక్షయ్ కుమార్ (164), దేవతి శ్రీనివాస్ (161), డాక్టర్ రాపాల రాజు(133), జావెద్ అహ్మద్ (130), గడ్డం శ్రీనివాస్ రెడ్డి(129), లయిశెట్టి హరికృష్ణ(125), కంటె సాయన్న (116), వేముల కర్ణాకర్ రెడ్డి (112), మంచికట్ల ఆశమ్మ(110)కు ఓట్ల చొప్పు పోలయ్యాయి.

 మొత్తం చెల్లుబాటైన 2,23,343 ఓట్లలో ఫస్ట్ ప్రయార్టీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు కలిపి 2,06,659 ఓట్లు రాగా.. యాదగిరి శేఖర్ రావు, మహ్మద్ ముస్తాక్ అలీ, సర్దార్ రవీందర్ సింగ్ కు కలిపి 8,384 ఓట్లు వస్తే మిగతా 50 మందికి కలిపి 8,301 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో ప్రచారం చేసినా ఓట్లు పడలే..

కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తొలుత బీఆర్ఎస్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. కానీ ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్​బీ) నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దిగారు.  బ్యాలెట్ పేపర్ లో తన పేరు కాస్త పైకి వచ్చేందుకే ఏఐఎఫ్​బీ తరఫున పోటీ చేశారు. కాగా పార్టీ పేరును ప్రచారంలో ఎక్కడ వాడుకోలేదు. బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు, కవిత ఫొటోలతోనే ప్రచారం చేశారు.

కరీంనగర్ సిటీలో ఆయా నేతల ఫొటోలతో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేయడమే కాకుండా పాంప్లెట్లు పంచారు. దీంతో ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయనేది బీఆర్ఎస్ తోపాటు ఇతర పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది. కానీ, ఆయనకు కేవలం ఫస్ట్ ప్రయార్టీ ఓట్లు 2,047, సెకండ్ ప్రయార్టీ ఓట్లు మరో 206 మాత్రమే రావడం గమనార్హం.