- వినోద్ కుమార్ గెలుపు ఛాలెంజ్‌గా తీసుకున్న అధిష్ఠానం
- బంధువర్గంపై అవినీతి ఆరోపణలతో మాజీ ఎంపీకి తలనొప్పులు
కరీంనగర్, వెలుగు : లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకోవాలని బీఆర్‌ఎస్ అధిష్టానం సవాల్ గా తీసుకుంది. లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని ఎప్పటిలాగే కరీంనగర్ నుంచే ప్రారంభించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ.. ద్వితీయ శ్రేణి నాయకులకు అవకాశాలు దక్కకపోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. అసంతృప్తితో ఇప్పటికే కిందిస్థాయిలో చాలా మంది పార్టీని వీడుతుండగా.. కీలక నేతలు జంపింగ్ కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నైరాశ్యంలో పార్టీ క్యాడర్
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎన్నికలొచ్చినా విభేదాలను, అసంతృప్తిని పక్కనబెట్టి పని చేసిన క్యాడర్.. అధికారం కోల్పోయాక పార్టీకి క్రమంగా దూరమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక పదవి రాకపోతుందా, పనులు చేసుకోలేకపోతామా అనుకున్న క్యాడర్ కు అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. గత సర్కార్ హయాంలో వినోద్ కుమార్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా తమకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించలేకపోయారనే ఆవేదన పలువురు కార్యకర్తల్లో ఉంది. ఇటీవల కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో శ్యామ్ అనే కార్యకర్త పార్టీ పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
నియోజకవర్గ ఇన్ చార్జిలు సహకరించేనా ?
2019 లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ కుమార్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. బండి సంజయ్‌కు దాదాపు 90 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఏడు సెగ్మెంట్‌లలో హుజురాబాద్, సిరిసిల్లలలో మాత్రమే బీఆర్‌ఎస్ కు మెజార్టీ వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మిగతా ఐదు నియోజకవర్గాల్లో బీజేపీకి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. సొంత పార్టీ నేతలు పూర్తి స్థాయిలో సహకరించకపోవడం వల్లే తాను ఓటమి పాలయ్యానని పలుమార్లు వినోద్ కుమార్ స్వయంగా ప్రకటించారు.
మరో వైపు తమకు వ్యతిరేకంగా పని చేసే కొందరు అసంతృప్త నాయకులను వినోద్ దగ్గరికి తీయడం, వారికి పనులు చేసి పెట్టడం కూడా ఆ పార్టీ నియోజకర్గ ఇన్ చార్జిలు, ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. ఎంపీగా గెలిస్తే వినోద్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పవర్ సెంటర్ గా మారుతారనే ఉద్దేశంతోనే కొందరు నేతలు గత ఎన్నికల్లో సహకరించలేదనే ఆరోపణలు వినిపించాయి. ఈ సారైనా వారు సహకరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బంధువర్గం పేరిట అవినీతి ఆరోపణలు..
తెలంగాణ జెన్‌కో లో బోయిన్ పల్లి సరితారావు అనే మహిళకు వినోద్ కుమార్ ఉద్యోగం ఇప్పించినట్లుగా రెండు నెలల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని అప్పట్లో బీజేపీ సోషల్ మీడియా వైరల్ చేసింది. సరితారావు ఎవరో తనకు తెలియదని, తాను ఉద్యోగం ఇప్పించలేదని వినోద్ కుమార్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇటీవల రంగారెడ్డి వట్టినాగులపల్లిలో భూదాన్ భూములను వినోద్ కుమార్ సోదరుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
కరీంనగర్ సెంటిమెంట్ కలిసొచ్చేనా ?
బీఆర్ఎస్ పార్టీ అధినేత ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొదటి నుంచి సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో సింహగర్జన పేరిట కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్‌లోనే భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనేక సభలు, స్కీమ్ ల ప్రారంభానికి కరీంనగర్ వేదికగా మారింది. కానీ2019 లోక్ సభ ఎన్నికల సభలో అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 'హిందూగాళ్లు.. బొందుగాళ్లు' అంటూ చేసిన కామెంట్స్ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాయి.
దీంతో ఆ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. తర్వాత హుజురాబాద్ బై ఎలక్షన్ లో దారుణంగా ఓటమిపాలైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించినా.. రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. హుస్నాబాద్ లోనూ గెలవలేదు. ఈ సారైనా కరీంనగర్ సెంటిమెంట్ పని చేస్తుందా.. లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.