రూ.36లక్షలతో పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు
కరీంనగర్‍టౌన్, వెలుగు: దేశంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా కరీంనగర్ సిటీని తీర్చిదిద్దుకుందామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం స్థానిక కోతిరాంపూర్ లో రూ.36లక్షల నిధులతో పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. మానేర్ రివర్ ఫ్రంట్,కేబుల్ బ్రిడ్జి పనులతో పాటు అందమైన పార్కులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. అంతకుముందు అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, మాధవి, స్వప్న, హరిశంకర్ పాల్గొన్నారు.
కేసీఆర్ నియంతృత్వ పాలనకు భయపడం
కరీంనగర్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో 2014 నుంచి కేసీఆర్ హిట్లర్ పాలన సాగిస్తున్నారని, నియంతృత్వ పాలనకు, దాడులకు బీజేపీ భయపడదని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. బుధవారం ఉదయం 11గంటల నుంచి ఒంటిగంట వరకు కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరసన దీక్షకు ఆయన హాజరయ్యారు. ముందుగా సంజయ్‌తోపాటు మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ లిక్కర్ మాఫియాలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ పై కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అందరినీ మోసం చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ దేనని అన్నారు.
‘లాఠీచార్జి’ బాధ్యులను అరెస్ట్ చేయాలి
కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎన్టీపీసీలో జరిగిన సీఐఎస్‌ఎఫ్ పోలీసుల లాఠీచార్జి ఘటనపై బుధవారం కాంట్రాక్టు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ గేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే చందర్, బీజేపీ స్టేట్ లీడర్ కౌశిక హరి, జడ్పీ టీసీ సంధ్యారాణి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కార్మికులపై, లీడర్లపై లాఠీచార్జికి పురిగొల్పిన హెచ్‌ఆర్ హెడ్ విజయలక్ష్మి, ఇతర ఆఫీసర్లు, సీఐఎస్‌ఎఫ్ పోలీస్ఆఫీసర్లు, సిబ్బంది బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులపై లాఠీచార్జిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా గురువారం ఎన్టీపీసీ పట్టణ బంద్‌కు పార్టీ పిలుపునిచ్చింది.
సిరిసిల్లలో నియంతలా కేటీఆర్
వేములవాడ, వెలుగు : సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్నియంతలాగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. బుధవారం వేములవాడ భీమేశ్వర గార్డెన్స్‌లో ఆయన మాట్లాడారు. నామినేటేడ్ పదవులు రద్దు చేసి సెస్ కి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కేటీఆర్ నియంతపాలనకు చరమగీతం పాడినట్లేనని తెలిపారు. సహకార విద్యుత్ సంస్థలో ఎన్నికలు నిర్వహించకుండా నామినేటేడ్ పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అవకాశం దొరికితే ఎమ్మెల్యేలను కూడా నామినేట్చేస్తారన్నారు. సమావేశంలో ఎంపీపీ మల్లేశం, మండలాధ్యక్షుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ పనులు వేగంగా పూర్తి చేయాలి
కరీంనగర్‍టౌన్, వెలుగు: మల్టీపర్పస్ స్కూల్ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని కరీంనగర్కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. బుధవారం నగరంలోని పాఠశాల ఆవరణలో రూ.2.65కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బిల్డింగ్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం భవిత సెంటర్ ను సందర్శించి ఉపాధ్యాయుల పని తీరును పరిశీలించారు. రేకుర్తి లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలను సందర్శించి మౌలిక వసతులతో పాటు స్కూల్ నిర్వహణపై ప్రిన్సిపల్, టీచర్స్ కు సూచనలు చేశారు. మౌలిక వసతుల పునరుద్ధరణ కు ప్రతిపాదనలు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం సుభాష్ నగర్ లోని ఎస్సీ కాలేజీని, బాలికల హాస్టల్ ను సందర్శించారు. ఆయన వెంట డీఈఓ జనార్దన్ రావు, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ సీఈఓ విరుపాక్షి ఉన్నారు.
జగ్గసాగర్ కేంద్రంగా మండలం చేయాలి
మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మండలంలోని జగ్గసాగర్ కేంద్రంగా మండలం ప్రకటించాలని బుధవారం గ్రామస్తులు తెలంగాణ తల్లి చిత్రపటం ముందు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రం కోసం 18 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాలకు జగ్గసాగర్సెంటర్ పాయింట్ గా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్ ను వినతిపత్రం అందజేశామని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జగ్గసాగర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్‌కి వివేక్ సంఘీభావం
గోదావరిఖని, వెలుగు : పట్టణంలోని తన స్వగృహంలో ధర్మదీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి బుధవారం సంఘీభావం తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచకొండ కోటేశ్వర్లు, మీడియా సెల్ రాష్ట్ర కన్వీనర్ కామ విజయ్, రామగుండం లీడర్లు ఉన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్, వివేక్ వెంకటస్వామిని బీజేపీ లీడర్లు శాలువాలతో సన్మానించారు.