కొత్త నాయకులతో హోరెత్తుతున్న కరీంనగర్

కొత్త నాయకులతో హోరెత్తుతున్న కరీంనగర్
  • బర్త్ డేలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లోకి..
  • ఎమ్మెల్యే సీట్  కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్

కరీంనగర్, వెలుగు: జనరల్ ఎలక్షన్లకు ఇంకా ఏడాదిన్నర టైమ్​ఉన్నప్పటికీ కరీంనగర్ లో మాత్రం పొలిటికల్​హీట్​ పెరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఛోటామోటా నాయకులు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. నాయకుల బర్త్ డేలు, ఈ మధ్య జరిగిన గణేశ్, దుర్గామాత ఉత్సవాలను వేదికగా చేసుకుని ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. కొందరు పార్టీల పేర్లు చెప్పి ప్రచారాలు చేస్తుంటే.. ఇంకొందరు పార్టీల పేర్లు లేకుండానే వ్యక్తిగతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు.

తెర మీదకు నయా లీడర్లు.. 

ఐదు నెలల క్రితం అస్ర్టేలియా నుంచి వచ్చిన ఎంఎస్ ఆర్ మనవడు రోహిత్ గ్రామ స్థాయిలో క్యాడర్ ను తయారు చేసుకుంటున్నారు. రెండు నెలల క్రితం కురిసిన వానలకు ఇండ్లు కూలిన బాధితులకు ఆర్థిక సాయంతోపాటు సామగ్రి అందించారు. హైదరాబాద్ లో ఎంఎస్ ఆర్ బుక్ రిలీజ్ చేసి అందరి దృష్టి ఆకర్శించారు. పొన్నం ప్రభాకర్ పాదయాత్రలోనూ తన బలాన్ని చూపించారు.  అలాగే చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలానికి చెందిన కొత్త జయపాల్ రెడ్డి సిటీలో సుమారుగా 500 చోట్ల ఫ్లెక్సీలు కట్టించారు. ప్రతి డివిజన్ పేరు, అక్కడ మిత్ర మండలి పేరిట యువత ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ బర్త్ డే వేడుకలను సిటీ నడిబొడ్డున గీతాభవన్ చౌరస్తాలో భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసి, టెంట్ వేసి కేక్ కట్ చేయడం విశేషం. యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. పురుమల్ల శ్రీనివాస్ తో పాటు సిటీకి చెందిన ఓ విద్యావేత్త, ప్రముఖ డాక్టర్ సైతం  టికెట్లు ఆశించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎవరికి వారు ఫేస్ బుక్ పేజీలు, వాట్సప్ గ్రూపులు, యువసేనలు, మిత్రమండలి క్రియేట్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ చార్జిలను నియమించుకుని ఏ చిన్న పని చేసినా పోస్ట్ లు పెడుతూ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.      

అధికార పార్టీలోనూ..

అధికార పార్టీలోని లీడర్లు సైతం ఎమ్మెల్యే  సీటుపై కన్నేశారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన చెల్మెడ లక్ష్మీ నరసింహరావుకు ఎమ్మెల్యే సీటు పక్కా అని ఆయన అనుచరులు ఢంకా బజాయిస్తున్నారు. అలాగే సీఎంకు దగ్గరి వ్యక్తిగా ఉంటున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈ మధ్య నాయకుల వద్దకు వెళ్లి సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుత మేయర్ సునీల్ రావు కూడా సిటీపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీరితో  పాటు సిటీకి చెందిన ఓ  విద్యావేత్త, ఓ ప్రముఖ డాక్టర్ కూడా ఎమ్మెల్యే పదవి కోసం గ్రౌండ్ వర్క్​చేస్తున్నట్లు సమాచారం.