కరీంనగర్, వెలుగు : లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు అలర్టయ్యాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. కరీంనగర్ ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తరఫున బరిలో దిగేందుకు పలువురు లీడర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరును ఖరారు చేయగా, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ వైపే ఆ పార్టీ అధిష్టానం మొగ్గుచూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన, ఇతరుల కోసం త్యాగం చేసిన లీడర్లు కరీంనగర్ టికెట్ కోసం పోటీపడుతున్నారు.
కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావహులు
ఈ స్థానం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పోటీ చేసి గెలిచారు. తరువాత వరుసగా 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్, వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ తరఫున కరీంనగర్ ఎంపీ టికెట్ పై పోటీచేసేందుకు అనేక మంది లీడర్లు ఆసక్తి చూపుతున్నారు. వారిలో జగిత్యాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, హుస్నాబాద్ టికెట్ ను త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, హుజూరాబాద్ టికెట్ ను త్యాగం చేసిన ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గతంలో జీవన్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ బైపోల్ లో కేసీఆర్ పై పోటీచేసి 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వారితోపాటు కరీంనగర్ టికెట్ ఆశించి భంగపడిన పీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు, కొనగాల మహేశ్ కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది.
బండికే సంజయ్ మరో చాన్స్
బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన అభ్యర్థిత్వానికే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సంజయ్.. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలపై దృష్టిసారించారు. శనివారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ జిల్లా, మండల అధ్యక్షుడు, ఇతర ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. అయితే, ఇదే టికెట్ ను సీనియర్లు పోలసాని సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఈవిషయమై వారిద్దరూ తమ అనుచరులతో సమావేశం కావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే వినోద్ ప్రచారం
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి బహిరంగ సభలోనూ చెప్పారు. లోక్ సభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే వినోద్ కుమార్ తన ప్రచారం ప్రారంభించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు.
గత ఎన్నికల్లో తన పార్టీ ఎమ్మెల్యేలే తనకు ఓట్లు వేయించలేదని, వారిని నమ్ముకుని ఓడిపోయానని పలు సభల్లో ఆయన ప్రకటించారు. అయితే ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవడం, పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్ల మీద ఆధారపడడం వంటి కారణాల వల్లే వినోద్ గత ఎన్నికల్లో ఓడిపోయారనే ప్రచారం జరిగింది. ఈసారి ఆ సమస్యను ఆయన ఎలా అధిగమించగలుతారు, ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు ఆయనకు ఎంత వరకు సహకరిస్తారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నిరాశలో ఉన్న పార్టీ క్యాడర్ ఏ మేరకు పని చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.