
- మొన్నటి వరకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు చూపిన చోట.. ఇప్పుడు ప్రొహిబిటెడ్/ఎఫ్టీఎల్ అని ప్రత్యక్షం
- ఎన్వోసీ తెచ్చుకోవాలని సూచిస్తున్న మున్సిపల్ సిబ్బంది
- వాటి కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతన్న జనం
- ఎన్వోసీ ఇచ్చినా వెంటనే ప్రొహిబిటెడ్ నుంచి పోతలే
- ఎల్ఆర్ఎస్ 25% రాయితీ గడువు ముగుస్తుండడంతో ఆందోళన
కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, శిఖం తదితర భూములు కాకపోయినా, కోర్టు కేసులు లేకపోయినా.. ఎల్ఆర్ఎస్ పోర్టల్ లో వేలాది ప్లాట్లు అకారణంగా ప్రొహిబిటెడ్ లిస్టులో చేరిపోయాయి. మొన్నటి వరకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ అయినట్లు చూపిన ప్లాట్లు ఇప్పుడు ప్రొహిబిటెడ్/ఎఫ్టీఎల్ లో ఉన్నట్లు చూపుతున్నాయి. ఎల్ఆర్ఎస్ చార్జీలు చెల్లించేందుకు సిద్ధమైన దరఖాస్తుదారులు తమ ప్లాట్లు ప్రొహిబిటెడ్లో ఉండడం చూసి షాక్కు గురవుతున్నారు.
ఇలా ఎందుకొచ్చిందంటూ మున్సిపల్ ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) తెచ్చుకోవాలని చెప్పి పంపుతున్నారు. దీంతో ప్లాట్ల ఓనర్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లి తమ డాక్యుమెంట్ జిరాక్స్ తోపాటు ఒక అప్లికేషన్ ఇచ్చి ఎన్ఓసీలు తీసుకోవాల్సి వస్తున్నది. ఒక్క కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే ఎన్వోసీల కోసం రెండు రోజుల్లో 1,500 దరఖాస్తులు వచ్చాయి.
సాఫ్ట్వేర్ లోపంతో!
ప్రభుత్వం 25 శాతం రాయితీతో ఈ నెల 31 వరకు ఎల్ఆర్ఎస్ చార్జీలు చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతోపాటు ఎల్ఆర్ఎస్ పోర్టల్లో ప్లాట్ల ఓనర్లు చూసుకునేలా ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ చేసింది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, ఫారెస్ట్, చెరువు శిఖాలతోపాటు ఆయా భూములకు 200 మీటర్ల పరిధిలోని సర్వే నంబర్లలోని ప్లాట్లకు కూడా ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ కాలేదు. వీటికి ప్రొహిబిటెడ్/ఎఫ్టీఎల్గా పేర్కొన్నారు. ఈ క్రమంలో అసలు సమీపంలో ఎలాంటి చెరువులు, కుంటలు(నీటి వనరులు) లేకపోయినా, ప్రభుత్వ భూములు లేకపోయినా కొన్ని ప్రైవేట్ సర్వే నంబర్లకు కూడా ఫీజు ఇంటిమేషన్ లెటర్లు జనరేట్ కాలేదు.
ఈ ప్లాట్లు ప్రొహిబిటెడ్/ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నట్లు చూపారు. ఇది మొదటి నుంచీ ఉన్న సమస్య. ఇదికాక రెండు, మూడు రోజుల కింద కొత్త సమస్య తలెత్తింది. కొందరికి ఎల్ఆర్ఎస్ పోర్టల్ లో మొన్నటి వరకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు కనిపించాయి. ఇప్పుడు ఆ లెటర్లు పోయి.. ఫీ నాట్ ఇంటిమేటెడ్(ప్రొహిబిటెడ్/ఎఫ్ టీఎల్) అని చూపిస్తుండడంతో ప్లాట్ల ఓనర్లు ఆందోళనకు గురవుతున్నారు. కేవలం సాఫ్ట్వేర్ సమస్య వల్లే లక్షలాది ప్లాట్లు ఒక్కసారిగా ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్లినట్లు తెలుస్తున్నది.
తలలు పట్టుకుంటున్న సిబ్బంది
25 శాతం రాయితీతో ఫీజు చెల్లించే గడువు దగ్గరపడడం, తమ ప్లాట్లు ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నట్లు రావడంతో వందలాది మంది ప్లాట్ల ఓనర్లు ఒక్కసారిగా మున్సిపల్ ఆఫీసుల్లోని ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్కులకు తరలివస్తున్నారు. అన్ని క్లియర్ గా ఉన్న తమ ప్లాట్లను ప్రొహిబిటెడ్ జాబితాలో ఎలా చేరుతున్నాయని సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అది సాఫ్ట్ వేర్ సమస్య అని, తమకు సంబంధం లేదని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి ఎన్వోసీలు తెచ్చుకోవాలని చెప్పి పంపిస్తున్నారు. దీంతో ఒక్కో సమస్యపై ప్లాట్ల ఓనర్లు నాలుగైదు సార్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వందల అప్లికేషన్లు!
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు తమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ జిరాక్స్ తోపాటు తమకు ఎన్వోసీ ఇవ్వాలని ఒక అప్లికేషన్ రాసి సబ్ రిజిస్ట్రార్ కు ఇస్తే సిబ్బంది సర్టిఫికెట్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. వరంగల్ లోని పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి వెంటవెంటనే ఎన్వోసీలు ఇచ్చేస్తున్నారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రెండు రోజుల్లోనే 1,200 వరకు అప్లికేషన్లు రాగా.. ఇందులో 500 వరకే ఎన్వోసీలు ఇచ్చారు.
సోమవారం ఇచ్చినవాళ్లకు కూడా ఇప్పటి వరకు ఎన్వోసీ జారీ కాలేదు. శుక్రవారం వచ్చిన చాలా మందికి రెండు, మూడు రోజులు ఆగి రావాలని సూచించారు. అయితే.. ఎన్వోసీ ఇచ్చినా ప్రొహిబిటెడ్ జాబితా నుంచి వెంటనే వెళ్లిపోవడం లేదని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల 25 శాతం రాయితీని కోల్పోయే పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. మరో నెల రోజులు గడువు పెంచాలనే కోరుతున్నారు.
ఎన్ఓసీకి నాలుగైదు రోజులు పడ్తుందంటున్నరు
మా ప్లాట్ ప్రొహిబిటెడ్ లిస్టులో పడడంతో ఎన్ఓసీ కోసం నేను సోమవారం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అప్లికేషన్ ఇచ్చిన. రోజూ తిరిగిపోతున్న. స్టాఫ్ తక్కువగా ఉన్నరు. వెరిఫై చేసి ఇవ్వడానికి ఇంకో నాలుగైదు రోజులు పడుతుందని చెప్తున్నరు. మున్సిపాల్టీలోని ఎల్1 ఆఫీసర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లో ఉన్న ప్రొహిబిటెడ్ లిస్టును వెరిఫై చేసుకుని ప్రొహిబిటెడ్ నుంచి తీసెయొచ్చు. డేటా అంతా ఆన్లైన్లో ఉన్నా ఇట్ల తిప్పడం సరికాదు. శనివారం తర్వాత వరుసగా రెండు రోజులు సెలవులే ఉన్నయ్. 25 శాతం రాయితీతో చెల్లించే గడువును ప్రభుత్వం పొడిగించాలి.’
శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్