బీజేపీలోకి కరీంనగర్ మేయర్ సునీల్ రావు

బీజేపీలోకి కరీంనగర్  మేయర్ సునీల్ రావు
  • స్థానిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ 
  • మరో 10 మంది కార్పొరేటర్లు సైతం.. 
  • నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్  సమక్షంలో చేరిక  
  • స్థానిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ 
  • కార్పొరేటర్లు పార్టీ మారకుండా గంగుల బుజ్జగింపులు
  • మాజీలు కావడానికి మూడు రోజుల ముందు హైడ్రామా

కరీంనగర్, వెలుగు:స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ తో అంటీముట్టన్నట్లుగా వ్యవహరిస్తున్న కరీంనగర్​ మేయర్  సునీల్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు10 మంది కార్పొరేటర్లు కూడా కమలం పార్టీలో చేరుతానని చేసిన ప్రకటనకరీంనగర్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రంగంలోకి దిగి శుక్రవారం రాత్రి బీఆర్ఎస్  కార్పొరేటర్లను పిలిపించుకుని పార్టీ మారొద్దని, బీఆర్ఎస్ లోనే భవిష్యత్ ఉంటుందని  సూచించినట్లు తెలిసింది. మరో మూడు రోజుల్లో మాజీలు కాబోతున్న ఈ ప్రజాప్రతినిధుల్లో ఎంత మంది పార్టీ మారుతారనే విషయం శనివారం తేలిపోనుంది.

లోక్ సభ ఎన్నికల నుంచే పార్టీకి దూరం.. 

లోక్ సభ ఎన్నికల సమయంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ పై విమర్శలు చేసిన మేయర్  సునీల్ రావు, ఎన్నికల తరువాత ఒక్కసారిగా యూటర్న్  తీసుకున్నారు. ఎంపీ సహకారంతోనే స్మార్ట్  సిటీ పనులు కంప్లీట్ అయ్యాయని, ఆయనే ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించారని ప్రశంసల వర్షం కురిపించారు. తర్వాత బండి సంజయ్  కేంద్ర మంత్రి అయ్యాక కార్పొరేటర్లందరినీ తీసుకెళ్లి సన్మానం చేయడం, పలుమార్లు ఆయనతో భేటీ కావడంతో అప్పట్లోనే మేయర్  చూపు బీజేపీ వైపు ఉందనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ తో కూడా కాస్త దూరం పాటిస్తూ వచ్చారు. 

 స్మార్ట్  సిటీ క్రెడిట్  సంజయ్  ఖాతాలో.. 

గతంలో స్మార్ట్  సిటీ ప్రాజెక్టు క్రెడిట్  అంతా మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కే ఇస్తూ వచ్చిన మేయర్ సునీల్ రావు.. కొంతకాలంగా ఆ పనుల క్రెడిట్ ను పూర్తిగా కేంద్ర మంత్రి బండి సంజయ్  ఖాతాలో వేయడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జరిగిన సభలో వినోద్ కుమార్, కేసీఆర్  పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం స్మార్ట్​ సిటీ బీఆర్ఎస్  ఘనతగా చెప్పుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కావాలనే ఈ పేర్లు ప్రస్తావించకుండా సునీల్ రావు బీఆర్ఎస్ తో గ్యాప్  పెంచుకుంటూ బీజేపీతో సఖ్యతగా మెలుగుతున్నట్లు అర్థమైంది. 

ఈ విషయాన్ని గమనించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. వారికి పరోక్షంగా చురక అంటించాలనుకున్నాడో ఏమో గానీ.. మాజీ ఎంపీ వినోద్ కుమార్  పేరును గుర్తు చేసి ఆశ్చర్యపరిచారు. చిన్న సిటీ అయినా కరీంనగర్  స్మార్ట్ సిటీ కావడం వెనక వినోద్ కుమార్  కృషి ఉందని గుర్తు చేశారు. ఆ తర్వాతే మేయర్  సునీల్ రావు  వినోద్  పేరును ప్రస్తావించడం గమనార్హం. 

బీఆర్ఎస్ కు రాజీనామా 

బీఆర్ఎస్​కు కరీంనగర్  మేయర్  సునీల్ రావు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కు శుక్రవారం రాత్రి లేఖ రాశారు. బీఆర్ఎస్ లో నాయకుడిగా, క్రియాశీలక కార్యకర్తగా పని చేసే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు బీఆర్ఎస్ కు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

బీఆర్ఎస్ లో భవిష్యత్ లేదనే.. 

విద్యార్థి, యువజన నాయకుడిగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పని చేసిన మేయర్ సునీల్ రావు.. 2015లో బీఆర్ఎస్ లో చేరారు. 2019లో అదే పార్టీ నుంచి మేయర్ గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు సన్నిహితుడిగా ముద్రపడిన ఆయన.. ఆ పార్టీలో భవిష్యత్  లేదనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 

వచ్చే మున్సిపల్  కార్పొరేషన్  ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేసి మరోసారి మేయర్  పీఠాన్ని అధిష్టించడం, లేదంటే నియోజకవర్గాల డీలిమిటేషన్  జరిగితే కరీంనగర్, లేదంటే పక్కన ఉండే జనరల్  నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న టార్గెట్ తోనే ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం ఫిక్స్​ చేసుకున్నట్లు మేయర్  సునీల్ రావు ప్రకటించారు.