మేయర్ సునీల్‌‌‌‌రావు విదేశీ పర్యటన​పై దుమారం

మేయర్ సునీల్‌‌‌‌రావు విదేశీ పర్యటన​పై  దుమారం
  • ఇన్‌‌‌‌చార్జి బాధ్యతలు మరొకరికి అప్పగించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు
  • కమిషనర్‌‌‌‌‌‌‌‌కు సమాచారం ఇచ్చానంటున్న మేయర్
  • 15 రోజుల్లోపే వస్తుండడంతో ఇన్‌‌‌‌చార్జి అవసరం లేదంటున్న అధికారులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్‌‌‌‌రావు అమెరికా పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. మేయర్ సునీల్‌‌‌‌రావు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లారని, ఆయన స్థానంలో ఇన్‌‌‌‌చార్జి మేయర్‌‌‌‌‌‌‌‌గా డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌కు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్‌‌‌‌ను కొందరు కార్పొరేటర్లు, బీసీ సంఘాల నాయకులు తెరపైకి తీసుకువస్తున్నారు. కాగా మేయర్ తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ నెల 24న అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. తన ప్రయాణ వివరాలను ఒక రోజు ముందే మీడియాకు వెల్లడించారు. నగర ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే తాను వాట్సప్ కాల్ లో అందుబాటులో ఉంటానని ప్రకటించారు. అలాగే కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కు సమాచారమిచ్చినట్లు మేయర్ తెలిపారు. 

ఇన్‌‌‌‌చార్జి బాధ్యతల అప్పగింతకు పట్టు

మేయర్ సెలవులో వెళ్తే ఇన్‌‌‌‌చార్జిగా మరొకరికి బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ అని, పాలనను గాలికి వదిలేసి సునీల్‌‌‌‌రావు విదేశాలకు వెళ్లారంటూ ఈ నెల 24న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మున్సిపల్ పాలనను గాడిన పెట్టేందుకు స్పెషలాఫీసర్ గా కలెక్టర్ బాధ్యతలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ స్వరూపారాణి హరిశంకర్ కి బాధ్యతలు అప్పగించాలని బీసీ సంఘాల నాయకులు సోమవారం కరీంనగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డిమాండ్ చేశారు. 

15 రోజుల్లోపే ఇండియాకు.. 

కాంగ్రెస్ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ ఫిర్యాదు నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి మేయర్‌‌‌‌‌‌‌‌ను వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో ఆయన తాను మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు సమాచారం ఇచ్చే అమెరికా వచ్చానని, అలాగే మున్సిపల్ యాక్ట్ ప్రకారం 15 రోజుల్లోపే తిరిగి ఇండియాకు వస్తున్నందున ఇన్‌‌‌‌చార్జి బాధ్యతలు ఎవరికీ అప్పగించాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. 

ఈ నెల 24న అమెరికా వెళ్లిన మేయర్ సునీల్ రావు.. తిరిగి సెప్టెంబర్ 6న ఇండియాకు వచ్చేందుకు బుక్‌‌‌‌ చేసుకున్న రిటర్న్ టికెట్లను సోమవారం మీడియాకు రిలీజ్ చేశారు. ఇవే టికెట్లను కలెక్టర్ కు కూడా పంపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ -2019లోని 34(2) సెక్షన్ ప్రకారం.. మున్సిపల్ చైర్మన్‌‌‌‌/చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌/మేయర్‌‌‌‌‌‌‌‌, లేదా వైస్ చైర్మన్/చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌/ డిప్యూటీ మేయర్  వరుసగా 15 రోజులకుపైగా అధికారిక విధులకు గైర్హాజరు కావడం లేదా తన అసమర్థత కారణంగా విధులకు హాజరు కాలేకపోతే ప్రభుత్వం నియమించిన వ్యక్తి లేదా కలెక్టర్ విధులు నిర్వర్తించాలి. కానీ 14 రోజుల్లోగానే మేయర్ తిరిగి ఇండియాకు వస్తున్నందున ఇన్‌‌‌‌చార్జి బాధ్యతలు మరొకరికి అప్పగించడమనే ప్రశ్నే తలెత్తదని ఎంఏయూడీకి చెందిన సీనియర్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు.