తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం : బండి సంజయ్

తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ కుమార్. కేసీఆర్ సర్కార్ రైతు బంధు పథకం ప్రవేశ పెట్టి.. అన్ని సబ్సిడీలను తొలగించిందని చెప్పారు. కౌలు రైతులు ఏం పాపం చేశారని వారికి రైతు బంధు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీని తట్టుకోలేకే టీఆర్ఎస్ కాస్తా.. బీఆర్ఎస్ అయ్యిందన్నారు. టూరిస్ట్​ మాదిరిగా కేసీఆర్.. దేశంలో తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

Also Read : గుడ్ న్యూస్ : రైతులకు మరో రూ.2 వేలు ఇవ్వటానికి మోదీ సర్కార్ ప్రయత్నాలు

బీసీ బంధు పథకం సొంత పార్టీ (బీఆర్ఎస్​) కార్యకర్తలకే ఇవ్వలేదన్నారు ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల కబ్జాలు, అవినీతి అరచకాలు తట్టుకోలేక, భరించలేక ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పారు. ప్రజలకు భరోసా కల్పించే పార్టీ బీజేపీయే కనిపిస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరీనంగర్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

మరోవైపు.. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా.. బీజేపీపై బీఆర్ఎస్ సర్కార్​ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ సడక్ యోజన కింద వేస్తున్న రోడ్ల నిధులు, నేషనల్​ హైవే రోడ్ల నిధులు, రైల్వే, రైతు వేదిక నిధులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. రేషన్ బియ్యం పంపిణీ డబ్బులు, స్మశాన వాటికల నిర్మాణాలకు, గ్రామపంచాయతీలకు నిధులు కేంద్రమే ఇస్తోందన్నారు. 

స్మార్ట్ సిటీ​, మున్సిపాలిటీలకు ఇస్తున్న నిధులు ఎవరివి..? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన ఇండ్లను కట్టకుండా మోసం చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాతీయలకు, కార్పొరేషన్లకు ఇచ్చిన నిధులు చూపాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్​ పేరుపై టాయిలెట్ల నిర్మాణాలను కూడా కేంద్రమే కట్టిస్తోందన్నారు.