పాలమూరు, ఇందూర్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలు సక్సెస్ అయ్యాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారన్నారు. తెలంగాణ ప్రజలు దేశ ప్రధానిని మర్చిపోరని అన్నారు. మోదీ నిధుల వరదజల్లుతో కల్వకుంట్ల ఫ్యామిలీకి పిచ్చి లేస్తోందన్నారు. ట్విట్టర్ టిల్లు ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ది అసలు ఏ కూటమో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు.
ప్రధాని మోదీ మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడన్నారు. పొలిటికల్ కామెంట్స్ చేయాలి గానీ.. వ్యక్తి గత ఆరోపణలు చేయొద్దన్నారు. బీసీలను, దళితులను ఎందుకు సీఎం చేస్తాలేరని ప్రశ్నించారు. మోదీని విమర్శించే స్థాయి మీది కాదన్నారు. ముడతల షర్టు.. కలర్ పోయిన చెప్పులు... కేటీఆర్ వి అని కామెంట్స్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు పంచింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల్లో పంచిన డబ్బుల సంగతి ఏంటి..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను చూస్తే నిజాం గుర్తుకు వస్తుండన్నారు. తన ఆరోగ్యం బాగో లేదని, తన కుమారుడు (కేటీఆర్ )ను సీఎం చేస్తానని చెప్పింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. తడి బట్టలతో కేసీఆర్ భాగ్యలక్ష్మి గుడికి రావాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ కుమారుడు కేటీఆర్ భాషా చూసి తెలంగాణ సమాజం ఛీ అంటోందన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు. 15 రోజుల నుంచి కుమారుడు పెట్టె ఇబ్బందులు భరించలేక కేసీఆర్ బయటకు రావడం లేదన్నారు. ఫ్రస్టేషన్, డిప్రెషన్ లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లారని అన్నారు. ప్రధానిపై హద్దు మీరి మాట్లాడవద్దని హెచ్చరించారు. గాంధీని తాము పూజిస్తామన్నారు. గాంధీ జయంతికి కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదన్నారు. గాడ్సే జయంతికి వెళ్తారా..? కేసీఆర్ ఎవరి జయంతికి వెళ్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అన్నారు. దూప దీప నైవేద్యం లేని దేవాలయాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వేములవాడ ఆలయం కోసం తాను మాట్లాడితే అధికారులను బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.