![ప్రారంభించారు.. వదిలేశారు](https://static.v6velugu.com/uploads/2025/02/karimnagar-multipurpose-park-and-integrated-market-lie-idle-20-days-after-inauguration_Dw5N9z1HCb.jpg)
- 20 రోజుల కింద అట్టహాసంగా మల్టీపర్పస్ పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఓపెనింగ్
- స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ వినియోగంలోకి రాలే
- తెరుచుకోని సివిల్ హాస్పిటల్ సమీపంలోని షట్టర్లు
కరీంనగర్, వెలుగు: స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ సిటీలో కేంద్ర, రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించిన మల్టీ పర్పస్ పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంకా వినియోగంలోకి రాలేదు. వీటికంటే ముందే సివిల్ హాస్పిటల్ పక్కనే నిర్మాణం పూర్తయి స్ట్రీట్ వెండర్స్‌కు కేటాయించిన షట్టర్లు కూడా ఇంకా ఓపెన్ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభించినా..
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన మల్టీపర్పస్ పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్.. తదితర పద్మానగర్‌లో సకల హంగులతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో 114 వెజిటేబుల్స్, 12 ఫ్రూట్స్, 12 ఫ్లవర్స్, 26 నాన్ వెజ్ స్టాల్స్ తో పాటు 22 షట్టర్స్ కలిపి మొత్తం 193 స్టాళ్లకు లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులకు కేటాయించారు. అలాగే కరీంనగర్ నగర నడిబొడ్డున తెలంగాణ చౌక్ సమీపంలో నిర్మించిన మల్టీపర్పస్ పార్కు నిర్వహణకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ను ఎంపిక చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మల్టీ పర్పస్ పార్క్ ను జనవరి 24న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో ఇవి ప్రారంభమయ్యాయని అనుకుని అక్కడికి వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది.
ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం
పద్మనగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో షాపులు దక్కించుకున్నవాళ్లలో సగం మంది మాత్రమే అడ్వాన్స్ డిపాజిట్ చేశారు. మిగతా వాళ్లకు నోటీసులు పంపి ఈ నెలాఖరులోగా మార్కెట్‌లో స్టాల్స్ ఓపెన్ చేసేలా చర్యలు తీసుకుంటాం. మల్టీ పర్పస్ పార్క్ కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్, అడ్వాన్స్ డబ్బుల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసి వారం రోజుల్లో ప్రారంభించేలా చూస్తాం. - చాహత్ బాజ్‌పాయ్, కరీంనగర్ బల్దియా కమిషనర్