రసాభాసగా మున్సిపల్ మీటింగ్ 

కరీంనగర్ టౌన్, వెలుగు:  స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో నిర్వహించిన కరీంనగర్ నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. శుక్రవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 95అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడారు. పనులపట్ల నిర్వక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ కోరారు. తన డివిజన్ కు కావాల్సిన నిధులు కేటాయిస్తలేరని, వెంటనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని 22వ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణి తెలిపారు. తన డివిజన్ లో స్మార్ట్ సిటీ పనులు ఎందుకు చేయడంలేదని 58వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి విజయ ప్రశ్నించారు. అయితే అధికార పార్టీ కార్పొరేటర్లు గంధె మాధవితో పాటు పలువురు తమ డివిజన్ల​లో పనులు బాగా జరుగుతున్నాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారని, అధికారుల తీరు బాగుందని ప్రశంసించడం విశేషం. 

రాత్రిదాకా బీజేపీ కార్పొరేటర్ దీక్ష..

55వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ తన డివిజన్ లో 180 మీటర్ల రోడ్డును ఇరువైపుల డ్రై‌‌‌‌‌‌‌‌నేజీలతో రూ.60లక్షల వ్యయంతో నిర్మించాలని, రూ.50లక్షలతో మరో రోడ్డును వేయాలని కోరారు. దీంతో రోడ్లు వేయాలని రోడ్లపై ధర్నా చేస్తే ఎలా వేస్తారని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో రోడ్డుపై కాదు తన డివిజన్ లో పనులు చేయించేందుకు పోడియం వద్ద ధర్నా చేస్తానని జితేందర్ ‘బాంచెన్ దొర.. మా రోడ్డు వేయండి’ అని ప్లకార్డు పట్టుకొని పోడియం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇలా ధర్నాలు చేస్తే ఒక్క రూపాయి కూడా కేటాయించనని, ఏం చేస్తావో చేసుకో అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాల్ నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2.30గంటలకు మీటింగ్ పూర్తయితే రాత్రి 7గంటల వరకు అదే హాల్ లో జితేందర్ ​దీక్ష కొనసాగించారు. దీంతో పోలీసులు వచ్చి ఆయనను బటయకు తీసుకెళ్లారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ స్వరూపారాణి, కమిషనర్ ఇస్లావత్, ఎస్ఈ నాగ మల్లేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.