
- పోస్టింగ్స్ లో పొలిటికల్ పైరవీలకు తావు లేదు
- 'వీ6 వెలుగు'తో కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కరీంనగర్, వెలుగు: అమాయకుల భూములు కబ్జా చేస్తే ఊరుకోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ కొత్త సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. గతంలో భూకబ్జాలు, ఆర్థిక నేరాలపై వచ్చిన ఫిర్యాదులపై ఎంక్వైరీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం 'వీ6 వెలుగు'తో మంగళవారం మాట్లాడారు.
గత సీపీ అభిషేక్ మహంతి హయాంలో ఏర్పాటు చేసిన ఎకానమిక్స్ ఆఫెన్సెస్ వింగ్ కొనసాగింపుపై ఆయన మాట్లాడుతూ.. ఈ వింగ్ పనితీరు తొలుత పూర్తిగా రివ్యూ చేసి ఇప్పటి వరకు పరిష్కరించిన కేసుల గురించి తెలుసుకుని నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు నార్కోటిక్ వింగ్ ద్వారా నిఘా పెంచుతామని, కమిషనరేట్ పరిధిలోకి ఎక్కడా గంజాయి సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోలీసుల అవినీతిపై ఆరోపణలను గుడ్డిగా నమ్మమని, విచారణ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోమన్నారు. విచారణలో ఆరోపణలు రుజువైతే కచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
పొలిటికల్ పోస్టింగ్స్ పై సీపీ మాట్లాడుతూ.. పొలిటికల్ పోస్టింగ్స్ కు తావులేదని, ఐజీ, డీఐజీల ఆదేశాల మేరకే పోస్టింగ్స్ ఉంటాయని స్పష్టం చేశారు. పోలీసుల టాలెంట్, సిన్సియార్టీ ఆధారంగానే పోస్టింగ్స్, ట్రాన్స్ ఫర్స్ ఉంటాయన్నారు. పోలీసుల పనితీరు గురించి పోలీస్ స్టేషన్ లోని క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు తమ ఫీడ్ బ్యాక్ చెప్పే అవకాశం ఉందని, ఈ విధానం సరైన రీతిలో అమలు చేసేందుకు కృషిచేస్తానని ఆయన తెలిపారు.