ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో.. కనువిందు చేస్తున్న రాయకల్ జలపాతం (వీడియో)

రాష్ట్రంలో  కురుస్తున్న వర్షాలతో జలపాతాలు హొయలొలుకుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్  జిల్లాలో జలపాతాలు ఆహ్లాదాన్ని..ఆనందాన్ని  పంచుతున్నాయి. 
మదిని కట్టిపడేస్తూ..ప్రకృతి అందాలు మైమరపిస్తున్నాయి. 

కరీంనగర్ జిల్లాలోని రాయకల్ జలపాతం ..జల రాగాలు  పలుకుతోంది.  చుట్టూ పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.... కొండల మధ్య సహజ సిద్ధంగా జాలువారే నీటి హొయలను చూస్తూ  పర్యాటకులు పులకించిపోతున్నారు.  పురివిప్పిన నెమలిలా ఈ జలధారలు చూపుతిప్పుకోనివ్వవు. 

రాయకల్ జలపాతంలో తడిసి ముద్దవుతూ..సందర్శకులు ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో అంటూ పాటలు అందుకుంటున్నారు. 18  కొండల నుంచి దివి నుంచి భువికి జాలువారుతున్న నీటి ప్రవాహాలను చూసి సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు.  జలకాలాటలతో సందడిగా గడుపుతున్నారు.  


ఈ సుందరమైన జలపాతం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 42 కిలోమీటర్ల దూరంలో సైదాపూర్ మండలం రాయికల్ గ్రామ సమీపంలో అడవి మధ్యలో ఉంది.  జెండాగుట్ట అనే పేరుతో దాదాపు 200 మీటర్ల ఎత్తైన కొండల నుండి నీరు క్రిందికి దుంకుతోంది. ఇక్కడి  జెండాగుట్ట పైన మరో మూడు చిన్న జలపాతాలున్నాయి.  వర్షాకాలం ప్రారంభమైనప్పుడల్లా, కొండల నుండి నీరు కిందకు పరుగులు పెడుతుంది. ఇది మూడు నెలల పాటు కొనసాగుతుంది.