కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కొత్త ఇళ్లు 70 వేలపైగానే

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో  కొత్త ఇళ్లు 70 వేలపైగానే
  • 2011లో 2.58 లక్షలుండగా 3.30 లక్షలకు పెరిగిన ఇండ్లు 
  • అత్యధికంగా కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో 89,617 ఇండ్లు
  •  సమగ్ర సర్వే స్టిక్కరింగ్‌‌‌‌లో వెల్లడైన ఇండ్ల వివరాలు 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఇళ్లు, కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది.  2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 2,58,485 ఇళ్లు ఉండగా.. ప్రస్తుతం 3,29,280కు పెరిగినట్లు గుర్తించారు. ఈ లెక్కన గత 13 ఏళ్లలో కొత్తగా 70 వేల వరకు కొత్త ఇళ్లు నిర్మాణం కావడం విశేషం. ఎన్యుమరేటర్లు వేసిన స్టిక్కరింగ్ ప్రకారం.. జిల్లాలో అత్యధికంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 89,617 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత జమ్మికుంట మున్సిపాలిటీలో 12,055, హుజూరాబాద్‌‌‌‌లో 10,095, చొప్పదండిలో 5,104, కొత్తపల్లిలో 3,795 ఇళ్లకు స్టిక్కరింగ్ వేశారు. 

రూరల్ ఏరియాలో మండలాల వారీగా చూస్తే మానకొండూరు మండలంలో 22,930 ఇళ్లు, గంగాధరలో 17,407, వీణవంకలో 16,697,  రామడుగు మండలంలో 15,449 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. తిమ్మాపూర్, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్ మండలాల్లో 14 వేలకుపైగా ఇళ్లకు స్టిక్కరింగ్ వేశారు.  2011లో  జిల్లాలో  1958 ఎన్యుమరేటర్ బ్లాక్స్ ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 2,688కు పెరిగింది. పెరిగిన ఇళ్లలో నివసిస్తున్న  కుటుంబాల సంఖ్య లక్షకుపైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకే సర్వే 

కరీంనగర్, వెలుగు: రాబోయే రోజుల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. యజమానికి ఇష్టమైతేనే వివరాలు సమర్పించాలని, తప్పనిసరేమీ కాదన్నారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌లో మీడియాతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా జిల్లాలో 1,958 ఎన్యుమరేటర్ బ్లాక్స్(ఈబీ) ఉన్నాయని, ఒక్కో బ్లాక్ లో 150  ఇళ్లు ఉంటాయని తెలిపారు. జనాభా పెరిగినందున ప్రస్తుతం కొత్తగా 730  కొత్త ఈబీలు గుర్తించామని, అందువల్ల వీటి సంఖ్య 2,700కు చేరిందన్నారు.

  175 ఇళ్లకు ఒక ఈబీగా జాబితా తయారు చేశామన్నారు. సుమారు 3,30,‌‌‌‌000 ఇండ్లు సర్వే చేయబోతున్నట్లు తెలిపారు. ఒక్కో ఈబీకి ఒక్కో ఎన్యుమరేటర్ చొప్పున మొత్తం 2,700 మందిని కేటాయించినట్లు తెలిపారు.  సోమవారం సాయంత్రం వరకు 60,400 ఇండ్ల సర్వే పూర్తయిందని,  ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 20 ఇళ్ల చొప్పున సర్వే చేస్తున్నారన్నారు.

 అన్ని వివరాలు ఆప్షనల్ మాత్రమేనని, కుటుంబ యజమాని ఇష్టప్రకారమే వివరాలు ఇవ్వవచ్చని చెప్పారు. తప్పిపోయిన ఇళ్లను తప్పకుండా గుర్తించి వారి వివరాలు కూడా సేకరిస్తామని తెలిపారు. సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, సీపీఓ కొమురయ్య పాల్గొన్నారు.