కరీంనగర్, వెలుగు: ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని ఆఫీసుకు వెళ్తేనే సవాలక్ష కొర్రీలు పెట్టే తహసీల్దార్లు ఉన్న రెవెన్యూ శాఖలో.. ఓ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ విషయంలో కరీంనగర్ రూరల్ తహసీల్దార్ చొరవ తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఇంటికే వెళ్లి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివారులో పట్టాదారు అయిన దామరపల్లి శ్రీనివాస్ కొంతకాలం క్రితం పక్షవాతం కారణంగా మంచం పట్టాడు.
ఇప్పుడు ఆయన కదల్లేని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తన పేరు మీద ఉన్న భూమిని ఆయన ఇద్దరు కొడుకులకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలని భావించారు. దీంతో కొడుకులు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. బుధవారం స్లాట్ బుక్ అయింది. తమ తండ్రిని ఆఫీసుకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో విషయం కరీంనగర్ రూరల్ తహసీల్దార్ పి.నవీన్ కుమార్ కు తెలియజేశారు. దీంతో స్పందించిన ఆయన వారి ఇంటి వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, అక్కడికక్కడే ఈ–- పాస్ బుక్ అందజేశారు.